logo

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలపై ఐదేళ్ల కిందట నిలిచిన కాంక్రీటు పనులు పునః ప్రారంభించారు. వేసవిలో చేపట్టాల్సిన ఈ పనులను కాలువలను తవ్విన గుత్తేదారు విస్మరించారు.

Published : 23 May 2024 03:22 IST

ఐదేళ్ల తర్వాత కాంక్రీట్‌ పనులు
కేఎల్‌ఐ డీ-8 కాలువపై నిర్మాణాలు

చాకల్‌పల్లి శివారులో కేఎల్‌ఐ డీ-8 కాలువపై నిర్మిస్తున్న డ్రాపు

వనపర్తి వ్యవసాయం, న్యూస్‌టుడే : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలపై ఐదేళ్ల కిందట నిలిచిన కాంక్రీటు పనులు పునః ప్రారంభించారు. వేసవిలో చేపట్టాల్సిన ఈ పనులను కాలువలను తవ్విన గుత్తేదారు విస్మరించారు. దీంతో కాలువలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపట్టిన కేఎల్‌ఐ పనులకు నాగర్‌కర్నూల్‌ కేంద్రంగా అధికారులు చేయించేవారు. మూడేళ్ల క్రితం ఏ జిల్లా పరిధిలోని పనులను ఆ జిల్లా నీటిపారుదల శాఖకు అప్పగించారు. వాటిని చేయాల్సిన గుత్తేదారు మాత్రం ఎవరి మాటలు వినకుండా వెళ్లిపోయారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా తూడుకుర్తి సమీపంలో డీ-8 కాలువ ప్రారంభమవుతుంది. రాంరెడ్డిపల్లి, లక్ష్మీదేవమ్మపల్లి, చాకల్‌పల్లి, ఏదుట్ల, రేమద్దుల గ్రామాల మీదుగా కోడేరు మండలం రాజాపూరు వరకు ఈ కాలువ 34 కి.మీ. దూరం నిర్మించారు. మొత్తం 28 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఈ కాలువపై 225 చోట్ల సిమెంటుతో డ్రాపులు, యూటీలు, వంతెనలు నిర్మించాల్సి ఉండగా కేవలం 35 చోట్ల మాత్రమే పనులు పూర్తి చేశారు. వీటి నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం వల్ల కాలువలో నీరు వేగంగా ప్రవహిస్తూ కట్టలకు ప్రమాదకరంగా మారింది. పొలాల నుంచి వర్షం నీరు వెళ్లకుండా ఈ కాలువ కట్టలు అడ్డుగా మారాయి. నీరు వేగంగా వెళ్లేచోట డ్రాపులు నిర్మించి నీటివేగాన్ని నియంత్రించాల్సి ఉంది. కొన్నిచోట్ల కాలువలపై వంతెనలు నిర్మించాల్సి ఉండగా వాటిని కూడా నిర్మించకుండా వదిలేశారు.

3 డ్రాపులు.. 2 యూటీల పనులు పూర్తి : గుత్తేదారు చేపట్టాల్సిన కాంక్రీటు పనులను ప్రతి ఏడాది వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం యాసంగిలో కాలువలకు నీటిని నిలిపివేశారు. దీంతో ఆరు నెలల క్రితమే పనులు ప్రారంభమవుతాయని రైతులు భావించారు. నీటిపారుదల శాఖ అధికారులు గుత్తేదారు వెంటపడినా పెడచెవిన పెడుతూ వచ్చారు. చివరకు రెండు నెలల క్రితం గుత్తేదారు డీ-8 కాలువపై సిమెంటు పనులు చేయడానికి ముందుకు రావడంతో నీటిపారుదల శాఖ ఈఈ మధుసూదన్‌రావు, డీఈ రమణాదేవి, ఏఈలు ఎక్కడెక్కడ నిర్మాణాలు చేపట్టాలో ఆయనకు సూచించారు. ఈనేపథ్యంలో చాకల్‌పల్లి, రాంరెడ్డిపల్లి, లక్ష్మీదేవమ్మపల్లి, ఏదుట్ల శివారుల్లో 9 చోట్ల డ్రాపులు, 4 చోట్ల యూటీల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు 3 డ్రాపులు, 2 యూటీల పనులు పూర్తయ్యాయి. పాన్‌గల్‌ మండలంలోని రేమద్దుల శివారులో మరో 10 సిమెంటు పనులు చేపట్టారు. ఈఈ మధుసూదన్‌రావు, డీఈ వెంకటరమణాదేవి, ఏఈ వెంకటేశ్వర్లు పనులను పర్యవేక్షిస్తున్నారు.


వేసవి వరకు పూర్తి చేస్తాం 

కేఎల్‌ఐ కాలువలు వనపర్తి నీటిపారుదల శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గుత్తేదారుతో పనులు చేయిస్తున్నాం. ప్రస్తుతం చేపట్టిన డ్రాపులు, యూటీలు, వంతెనల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. వేసవికాలం పూర్తయి కాలువలకు నీరు విడుదల చేసే వరకు ప్రారంభించిన 23 పనులను పూర్తి చేయిస్తాం.

మధుసూదన్‌రావు, ఈఈ, నీటిపారుదలశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని