logo

పురపాలిక జాగా.. అక్రమంగా పాగా

మహబూబ్‌నగర్‌ నడిబొడ్డులో పురపాలక సంఘానికి చెందిన ఖాళీ స్థలాన్ని కొందరు వ్యక్తులు అమ్మేశారు. వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి పురపాలక స్థలంలో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు.

Published : 23 May 2024 03:51 IST

బోర్డు తొలగించి ఇంటి నిర్మాణం ప్రారంభం
అనుమతులిచ్చిన అధికారులు

వారం క్రితం వరకు ఖాళీ స్థలంలో ఉన్న పురపాలిక బోర్డు,
బందెలదొడ్డిగా నమోదై ఉన్న పురపాలిక రికార్డు  

న్యూస్‌టుడే, పాలమూరు పురపాలకం : మహబూబ్‌నగర్‌ నడిబొడ్డులో పురపాలక సంఘానికి చెందిన ఖాళీ స్థలాన్ని కొందరు వ్యక్తులు అమ్మేశారు. వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి పురపాలక స్థలంలో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. అది పురపాలక సంఘానికి చెందిన స్థలమని అక్కడ బోర్డు ఉన్నా ఏమాత్రం లెక్క చేయలేదు. బోర్డును తొలగించి పిల్లర్‌ గుంతలు తవ్వాడు. రేపో మాపో పిల్లర్ల నిర్మాణం పూర్తవుతుంది.. ఇక్కడ కొసమెరుపేమిటంటే.. ఇంటి నిర్మాణానికి పురపాలక సంఘమే అనుమతి ఇవ్వటం. ఇన్నాళ్లు తమ ఇళ్ల మధ్య ఉన్న పురపాలక సంఘానికి చెందిన ఖాళీ స్థలంలో ప్రైవేటు నిర్మాణం జరుగుతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
పురపాలిక రికార్డుల్లో బందెలదొడ్డిగా.. : పట్టణంలోని ప్రస్తుత 43వ వార్డు (గతంలో 20వ వార్డు) పరిధిలోకి వచ్చే రాంనగర్‌లో 234.15 అడుగుల విస్తీర్ణంలో పురపాలక సంఘం పేరిటË బందెలదొడ్డి స్థలం ఉండేది. పొలాల్లో పశువులు ప్రవేశించి పంటలను నాశనం చేస్తే వాటిని తీసుకొచ్చి ఈ బందెలదొడ్డిలో నిర్బంధించేవారు. యజమాని వస్తే అతడి నుంచి జరిమానా వసూలు చేసి పశువులను వదిలేవారు. కాలక్రమేణ పట్టణం చుట్టూ పంట పొలాలు తగ్గి, ఇళ్లు విస్తరించడంతో బందెలదొడ్డి కార్యకలాపాలు తక్కువయ్యాయి. పురపాలక సంఘం బందెలదొడ్డిని తొలగించి ఖాళీ స్థలంగా ఉంచేసింది. ఇటీవల ఆ ఖాళీ స్థలం పురపాలికకు చెందినదిగా బోర్డు కూడా పాతారు. ఇంతవరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి రెండేళ్ల క్రితం ఆ ఖాళీ స్థలాన్ని దానికి ఆనుకొని ఉన్న ఓ ఇంటి యజమాని గుట్టుచప్పుడు కాకుండా మరొకరికి విక్రయించాడు. కొనుగోలు చేసిన వ్యక్తి స్థలాన్ని రూ.30 లక్షలకు మరో వ్యక్తికి విక్రయించాడు. ఈ వ్యవహారం చెవినపడిన వార్డు కౌన్సిలర్‌ బురుజు సుధాకర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. పురపాలక సంఘానికి చెందిన ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేయవద్దని, చట్టరీత్యా నేరం అవుతుందని హెచ్చరించారు. కౌన్సిలర్‌ను లెక్కచేయని ఆయన అప్పటి అధికార పార్టీ నేతల ద్వారా ఒత్తిడి తెచ్చి పురపాలిక ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణానికి పురపాలిక నుంచే అనుమతి తీసుకోవటం గమనార్హం. ఆగ్రహించిన కౌన్సిలర్‌ పురపాలిక స్థలంలో ఇంటి నిర్మాణం ఎలా చేపడతారో చూస్తానంటూ భీష్మించడంతో వెనక్కి తగ్గాడు. ఇంత తతంగం జరిగినా పురపాలక సంఘం దాని రికార్డుల్లో ఉన్న బందెలదొడ్డి స్థలాన్ని స్వాధీనం చేసుకుని రక్షణగా ప్రహరీ నిర్మించే ప్రయత్నం చేయలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పురపాలిక కార్యవర్గం మారగా కౌన్సిలర్‌ ఫిర్యాదు చేసి ఖాళీ స్థలంలో పురపాలిక పేరిట బోర్డు పాతించారు. ఖాళీ స్థలం కొనుగోలు చేసిన వ్యక్తి వారం క్రితం బోర్డు తొలగించి ఇంటి నిర్మాణానికి గుంతలు తవ్వారు. విషయం తెలిసి ‘న్యూస్‌టుడే’ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా ఈ స్థలం ముమ్మాటికీ పురపాలికదేనని సమీప ఇళ్ల వాళ్లు స్పష్టంచేశారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారి లక్ష్మీపతి దృష్టికి తీసుకెళ్లగా తమకు సమాచారం అందగా పనులు నిలిపివేయించామన్నారు. పురపాలిక స్థలాన్ని వదిలేసి ప్రైవేటు ప్లాటులో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని చెప్పి నోటీసు ఇచ్చామని, త్వరలో ప్రహరీ నిర్మిస్తామని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని