logo

పెట్రోల్‌ బంకులపై పర్యావేక్షణేదీ..!

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పలు పెట్రోల్‌ బంక్‌ల్లో చమురు తక్కువగా వస్తుందని, అందులోనూ కల్తీ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated : 23 May 2024 06:03 IST

ఉమ్మడి జిల్లాలో యథేచ్ఛగా మోసాలు
సౌకర్యాలను గాలికొదిలేసిన నిర్వాహకులు

  • నారాయణపేటలో కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనదారుడు ఓ బంక్‌లో రూ.200 పెట్రోల్‌ పోయించుకున్నారు. కొద్ది దూరం వెళ్లే సరికి బండి ఆగిపోయింది. ఎంతకీ బండి స్టార్ట్‌ కాకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే పెట్రోల్‌ ఏం లేదు.  తిరిగి బంకు వద్దకు వెళ్లి ఆందోళనకు దిగగా నిర్వాహకులు సర్ది చెప్పి మళ్లీ పెట్రోల్‌ పోసి పంపించారు. 

  • నాగర్‌కర్నూల్‌లో ఇటీవల ఓ వ్యక్తి పెట్రోల్‌ పోసుకుని ఇంటికి బయలుదేరారు. మధ్యలోనే వాహనం ఆగిపోవడంతో మెకానిక్‌ వద్దకు తీసుకెళ్లగా పరీక్షించి చూస్తే పెట్రోల్‌ లేదని, ఉన్నది కాస్త కల్తీ జరిగిందని గుర్తించి బండి యజమానికి తెలిపారు. వినియోగదారుడు బంక్‌ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు.

  • మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఓ వ్యాపారి తరచూ ఒకే బంక్‌లో పెట్రోల్‌ పోయించేవారు. ఇటీవల మైలేజీ తక్కువగా వస్తుండటాన్ని గమనించి మెకానిక్‌కు చూపించారు. పెట్రోల్‌లో తేడా ఉందేమోనని వేరే బంకులో పోయించుకోమని సూచించారు. తర్వాత ఆయన వేరే బంకులో పెట్రోల్‌ను పోయించుకోగా మంచి మైలేజీ వచ్చింది.

ఈనాడు, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని పలు పెట్రోల్‌ బంక్‌ల్లో చమురు తక్కువగా వస్తుందని, అందులోనూ కల్తీ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పాలమూరులో కొన్ని నెలలుగా జరిగిన పలు సంఘటనలే దీనికి నిదర్శనం. పూర్వ మహబూబ్‌నగర్‌లో సుమారు 320 వరకు పెట్రోల్‌ బంక్‌లున్నాయి. వీటిలో కొన్ని బంక్‌ల నిర్వాహకులు పెట్రోల్, డీజిల్‌లను కల్తీ చేస్తున్నాయి. కొన్నిచోట్ల చమురు పోసుకున్న పాయింట్ల కంటే 2-4 వరకు తక్కువగా వస్తున్నట్లు విమర్శలున్నాయి. మీటర్లలో సెట్టింగ్‌ చేసి పెట్టడం వల్లే పెట్రోల్, డీజిల్‌ తక్కువగా వస్తుందని తెలుస్తోంది. చమురులో నీళ్లు కలిపి రావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. బంకుల్లో ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్‌మెర్సిబుల్‌ మోటారు పంపు ఉంటుంది. వీటి ద్వారా పెట్రోల్, డీజిల్‌ వస్తుండటంతో అందులో నీళ్లు కలిపి వస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌ ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు చెల్లించిన మొత్తానికి కాకుండా రెండు నుంచి నాలుగు పాయింట్లు తగ్గించి రావడంతో వారి జేబులకు మరింత చిల్లు పడుతోంది.
పూర్తిస్థాయిలో తనిఖీలు లేవు..: ఉమ్మడి జిల్లాలో కొన్ని పెట్రోల్‌ బంకుల్లో మోసాలు యథేచ్ఛగా సాగుతున్నా.. అరికట్టడంతో అధికార యంత్రాంగం విఫలం అవుతోంది. పలు బంకుల్లో తనిఖీలు తూతూమంత్రంగానే కొనసాగుతున్నాయి. కొందరు బంక్‌ నిర్వాహకులు అధికారులతో లోపాయికారిగా ఒప్పందాలు చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖ అధికారులు ఈ బంక్‌లను విధిగా తనిఖీ చేయాలి. లీటర్‌ పెట్రోల్‌లో ఏమైనా కోత వేస్తున్నారా? పూర్తి స్థాయిలో పాయింట్లు వస్తున్నాయా? ఎక్కడైనా పాయింట్లు జంప్‌ అవుతున్నాయా? పెట్రోల్‌ నాసిరకంగా వస్తుందా? అనేవీ తరచూ పరిశీలించాలి. ఉమ్మడి జిల్లాలో ఇవేవీ సక్రమంగా అమలు జరగడం లేదు. తూనికలు, కొలతలశాఖలోని అధికారులు, బంకు నిర్వాహకులు ఫిట్టర్లను అడ్డం పెట్టుకుని వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి పెట్రోల్‌ బంక్‌కు ఒక ఫిట్టర్‌ ఉండాలి. ఆయన బంక్‌లో నాజిల్‌ ఎలా ఉంది? సక్రమంగా పని చేస్తుందా? డిస్‌ప్లే వస్తుందా? గన్‌షాట్‌ సరిగ్గా అమర్చారా? సరిగ్గా పని చేస్తోందా? వంటి సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఉమ్మడి జిల్లాలో కేవలం 10 మంది ఫిట్టర్ల ద్వారానే బంకుల్లో పరిశీలన జరుగుతోంది. ఈ ఫిట్టర్లు కూడా అధికారుల పర్యవేక్షణలో పని చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో పలు పెట్రోల్‌ బంక్‌ల్లో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. ప్రతి బంక్‌లో మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలి. వాహనదారులకు ఉచితంగా టైర్లలో గాలి నింపాలి. వినియోగదారులు అడిగితే తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలి. చాలాచోట్ల ఈ నిబంధనలేమీ అమలు కావడం లేదు.
పెట్రోల్, డీజిల్‌లో కల్తీ జరుగుతుందని వినియోగదారులకు అనుమానం వస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. 99083 69077 చరవాణికిగానీ, జిల్లా కేంద్రాల్లోని ఇన్‌స్పెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి బంకులో 5 లీటర్ల చమురుకు సంబంధించిన క్యాన్‌ ఉంటుంది. ఎవరికైనా అనుమానం వస్తే నిర్వాహకులను డిమాండ్‌ చేసి కల్తీపై పరిశీలన చేయవచ్చు. పెట్రోలు, డీజిల్‌ పాయింట్లు తక్కువగా వచ్చినా తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.  
-సిద్ధార్థ కుమార్, అసిస్టెంట్‌ కంట్రోలర్, తూనికలు, కొలతలశాఖ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని