logo

కాన్పుల్లో ఎందుకీ వైరుధ్యం!

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో వైరుద్ధ్యం పలు సందేహాలకు తావిస్తోంది.. ప్రైవేటులో సిజేరియన్‌ (సి-సెక్షన్‌) కాన్పుల సంఖ్య పెరుగుతుండగా.. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉంటున్నాయి.. ఉమ్మడి జిల్లాలో గతేడాది ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల్లో 75.49% సిజేరియన్‌ కాన్పులే ఉన్నాయి. 25.51 శాతం మాత్రమే సాధారణ కాన్పులు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం 69.90 సాధారణ కాన్పులు జరుగుతున్నాయి.

Updated : 25 Jan 2022 02:23 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70% సాధారణ ప్రసవాలు

ప్రైవేటులో 75 శాతం సిజేరియన్లు

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో వైరుద్ధ్యం పలు సందేహాలకు తావిస్తోంది.. ప్రైవేటులో సిజేరియన్‌ (సి-సెక్షన్‌) కాన్పుల సంఖ్య పెరుగుతుండగా.. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం సాధారణ ప్రసవాలు ఎక్కువగా ఉంటున్నాయి.. ఉమ్మడి జిల్లాలో గతేడాది ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల్లో 75.49% సిజేరియన్‌ కాన్పులే ఉన్నాయి. 25.51 శాతం మాత్రమే సాధారణ కాన్పులు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం 69.90 సాధారణ కాన్పులు జరుగుతున్నాయి. తప్పని పరిస్థితి అయితేనే వైద్యులు సిజేరియన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 30 శాతం మాత్రమే సిజేరియన్‌ కాన్పులు జరిగాయి.

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

మ్మడి జిల్లాలో 2021-22 సంవత్సరంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 30,035 కాన్పులు జరగగా అందులో 20,995 కాన్పులు సాధారణం, 9,040 కాన్పులు సిజేరియన్‌ ఉన్నాయి. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో 16,274 కాన్పులు జరగగా అందులో 3,990 కాన్పులు సాధారణం ఉండగా, 12,284 కాన్పులు సిజేరియన్‌ ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరం లేకున్నా సిజేరియన్‌ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గతేడాది ఉమ్మడి జిల్లాలో జరిగిన మొత్తం కాన్పుల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రులు, వైద్యులు పదేపదే చెబుతున్నా చాలా మంది ప్రైవేటుకు వెళ్లి ఇబ్బందులకు గురవుతున్నారు. అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తే పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. మత్తు మందు వినియోగించడం, ప్రసవం తరవాత నొప్పి తగ్గడానికి ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో దుష్ప్రభావం ఉంటుందని, తప్పనిసరైతే తప్ప సిజేరియన్లు చేయించుకోవద్దని చెబుతున్నారు.

మూడో నెల నుంచే..

* ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరగడానికి వైద్య, ఆరోగ్య శాఖ మూడో నెల నుంచి గర్భిణిపై ప్రత్యేక శ్రద్ధ సారిస్తోంది. గœర్భం దాల్చగానే ఆశా కార్యకర్తలు గర్భిణి పేరును రిజిస్ట్రేషన్‌ చేసి ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబరు తీసుకుని వారి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.

* కాన్పు జరిగే సమయంలోపు నాలుగుసార్లు గర్భిణికి ఏఎన్‌సీ పరీక్షలు చేపడుతున్నారు. పిండం ఎదుగుదల ఎలా ఉంది? గర్భంలో శిశువు శరీర భాగాలు సక్రమంగా ఎదుగుతున్నాయా? గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? విశ్లేషిస్తున్నారు.

* ఐరన్‌, ఇతర విటమిన్‌ మాత్రలను అందిస్తున్నారు. ఆమె కాన్పుకు ఇచ్చిన తేదీ నాటికి మానసికంగా సంసిద్ధంగా చేస్తున్నారు.

* ఒకవేళ ముందుస్తు కాన్పుకు అవకాశం ఉంటే ఎలాంటి చికిత్స అందించాలి? అనేదానిపై శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగా గర్భిణికి చెందిన భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులు చరవాణి నంబర్లు సేకరిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్లడానికి 102 వాహనం కూడా ఉచితంగా అందిస్తున్నారు.

ప్రైవేటులో ఇలా..

* ప్రసవ సమయం అంటే సాధారణంగా మహిళలు భయపడుతుంటారు. వారికి అవగాహన కల్పించి సాధారణ ప్రసవాలు చేయొచ్చు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రసవం కొంత ఇబ్బందికరంగా ఉన్నా, గర్భిణులు భయపడుతున్నా సిజేరియన్లు చేయడంపై దృష్టి పెడుతున్నారు.

* సాధారణ ప్రసవానికి రూ.20 వేల లోపే ఫీజులు ఉండటం, సీ సెక్షన్‌ అయితే రూ.50 వేల వరకు వసూలు చేసే అవకాశం ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు సి- సెక్షన్‌కు ఆసక్తి చూపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తప్పనిసరైతేనే..

గర్భిణులకు తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ చేస్తున్నారు. తల్లికి కానీ, పుట్టబోయే బిడ్డకు కానీ ప్రమాదం అనుకున్నప్పుడూ సి- సెక్షన్‌ కాన్పులు అవుతున్నాయి. సాధారణ కాన్పులు అయ్యే పక్షంలో ప్రైవేటు వైద్యులు కూడా ఆ ప్రసవాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కమీషన్ల కోసం, డబ్బుల కోసం ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్‌ చేస్తున్నాయన్న అపోహ మాత్రమే.

- డా.రామ్మోహన్‌, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్‌

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం..

పేరు నమోదు చేసుకున్న సమయం నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణిపై ఆశా కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపేలా చూస్తున్నారు. వారికి అవసరమైన మాత్రలు అందిస్తున్నారు. ఆ గర్భిణిల పరిస్థితి బట్టి పీహెచ్‌సీ, జిల్లా ఆస్పత్రి, జనరల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలా అనేదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. సాధారణ కాన్పులకే ప్రాధాన్యం ఇస్తున్నాం. తప్పనిసరి పరిస్థితి అయితేనే సిజేరియన్‌ చేస్తాం. కాన్పు జరిగిన తర్వాత ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12 వేలతో పాటు కేసీఆర్‌ కిట్‌ను అందిస్తున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి గర్భిణులు అనవసర ఇబ్బందులు పడొద్దు. అనారోగ్యాలకు గురికావొద్దు.

- డా.రాధ, గైనిక్‌ విభాగాధిపతి, జనరల్‌ ఆస్పత్రి, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని