logo

మార్కండేయ ఎత్తిపోతల ఏర్పాటుకు సన్నాహాలు

జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానుంది. బిజినేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి  శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేఎల్‌ఐ పథకం కింద కాలువలు తీసినప్పటికీ బిజినేపల్లి మండలంలో కొంత భాగానికి సాగునీరందడం లేదు.

Published : 10 Jun 2022 06:41 IST

న్యూస్‌టుడే, నాగర్‌కర్నూల్‌

జలాశయంగా మారనున్న మార్కండేయ చెరువు

జిల్లాలో మరో ఎత్తిపోతల పథకం అందుబాటులోకి రానుంది. బిజినేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకానికి  శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేఎల్‌ఐ పథకం కింద కాలువలు తీసినప్పటికీ బిజినేపల్లి మండలంలో కొంత భాగానికి సాగునీరందడం లేదు. ఎత్తైన ప్రదేశం కావడంతో సమస్యగా మారింది. చాలా రోజుల నుంచి ఈ ప్రాంత ప్రజలు సాగునీరందించేందుకు ఎత్తిపోతల పథకం కోసం డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పలుమార్లు సాగునీరందించేందుకు మినీ ఎత్తిపోతల పథకం మంజూరుకు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 05.06.2021న ఈ పథకానికి రూ.76.95 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్కండేయ చెరువును జలాశయంగా మార్చి 0.97 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ఉన్న కాలువ ద్వారా 40 మీటర్ల ఎత్తున జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. పథకం పూర్తయితే 7,310 ఎకరాలకు సాగునీరందనుంది. మామ్మయిపల్లి, పోలేపల్లి, శాయిన్‌పల్లి, లట్టుపల్లి, గంగారం గ్రామాలతో పాటు 17 తండాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు పెరుగటంతో పాటు చెరువులు, కుంటల్లోకి నీళ్లు వస్తాయి.


ఎదురుచూపులకు తెర..

ఇప్పటికే నిధులు మంజూరవడంతో ఎత్తిపోతల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బిజినేపల్లి మండలంలో చాలా గ్రామాలకు మేలు జరుగనుంది. ఈ పథకానికి 100 ఎకరాల నుంచి 120 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికి 60 ఎకరాల భూమి వరకు సర్వే పనులు పూర్తి చేశారు. పది రోజుల్లో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటించనుండటంతో నాగర్‌కర్నూల్‌ పట్టణంలో అభివృద్ధి పనులతో పాటు బిజినేపల్లిలో ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి రాక నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారులను కొద్ది రోజులపాటు తొలగించుకోవాలని సూచించారు. మార్కండేయ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సర్వే పనుల ప్రక్రియ కొనసాగుతోందని పనులు ప్రారంభిస్తే ఏడాది లోపు పూర్తి అవుతాయని నాగర్‌కర్నూల్‌ నీటిపారుదల శాఖ ఈఈ పార్థసారథి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని