logo

జిల్లాను అన్ని రంగాల్లో అగ్రపథాన నిలుపుతాం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రంగాల్లో ముందుంచేందుకు జిల్లా యంత్రాంగంతోపాటు ప్రజలూ భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా పిలుపునిచ్చారు.

Updated : 27 Jan 2023 06:40 IST

గణతంత్ర వేడుకల్లో కలెక్టరు యాస్మిన్‌ బాషా

ప్రగతి నివేదికను చదువుతున్న కలెక్టరు యాస్మిన్‌బాషా

వనపర్తి, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రంగాల్లో ముందుంచేందుకు జిల్లా యంత్రాంగంతోపాటు ప్రజలూ భాగస్వాములవ్వాలని కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌బాషా పిలుపునిచ్చారు. గురువారం గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా జిల్లా సమీకృత కలెక్టరు కార్యాలయ సముదాయ భవనం వద్ద ఆమె మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. వేదికపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్పీ అపూర్వారావు, పురపాలక సంఘం అధ్యక్షుడు గట్టుయాదవ్‌, జిల్లా అదనపు కలెక్టర్లు వేణుగోపాల్‌, ఆశిష్‌సంగ్వాన్‌ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరు యాస్మిన్‌బాషా జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి అమలు పరుస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను నివేదించారు.

విద్యారంగానికి పెద్దపీట..

విద్యాపర్తిగా పేరొందిన జిల్లాలో విద్యారంగానికి పెద్దపీట వేశామని కలెక్టరు తెలిపారు. 53 జూనియర్‌ కళాశాలలుండగా.. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఉచిత ఎంసెట్‌ శిక్షణ ఇస్తున్నామన్నారు. కొత్తగా మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాలలో 150 మందికి, మహిళా వ్యవసాయ కళాశాలలో 110 మందికి, నర్సింగ్‌ కళాశాలలో 60 మందికి, జేఎన్‌టీయూ ఇంజినీరింగు కళాశాలలో 123 మందికి ప్రవేశాలు కల్పించామన్నారు. జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో రూ.17 కోట్లతో 180 పడకలతో గర్భిణి, ప్రసవానంతర వైద్య సేవలు, పుట్టిన పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. యాసంగిలో రైతులకు 1.61 లక్షల మందికి రూ.169 కోట్ల రైతుబంధు పథకం సాయాన్ని వారి ఖాతాల్లో వేశామన్నారు. జిల్లా కేంద్రం శివారు మర్రికుంట వద్ద రూ.9.58 కోట్లతో వేసైడ్‌ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్నారు. జూరాల ప్రాజెక్టు, రాజీవ్‌భీమా ఎత్తిపోతలు, కేఎల్‌ఐ ద్వారా 1,72,380 ఎకరాలకు వానాకాలంలో నీరిచ్చామన్నారు. జిల్లాకు 10 చెక్‌డ్యామ్‌లకు రూ.23.50 కోట్లు మంజూరు.. 4 పూర్తి చేశామన్నారు. మిషన్‌ భగీరథ కింద జిల్లాలో రూ.260.50 కోట్ల పనలకుగాను రూ.206 కోట్లు వ్యయం చేశామన్నారు. మిగతా పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 104 ఉపకేంద్రాలను పల్లె దవాఖానాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపగా 21 కేంద్రాలకు అనుమతి లభించిందన్నారు. రైతులకు వ్యవసాయశాఖలోని శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, అవసరమైన శిక్షణనిచ్చేందుకు 71 రైతు వేదికలను నిర్మించామన్నారు. విద్యుత్తు, పౌరసరపరాలశాఖ, హరితహారం, ఎస్సీ అభివృద్ధిశాఖ, బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, గ్రామీణాభివృద్ధిశాఖ, విద్య, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, శాంతిభద్రతల శాఖల్లో సాధించిన ప్రగతిని కలెక్టరు నివేదికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి సన్మానించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తున్న కలెక్టరు యాస్మిన్‌బాషా, మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, ఎస్పీ అపూర్వారావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని