logo

బ్యాలెట్‌పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు

శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.

Updated : 26 Apr 2024 06:46 IST

అచ్చంపేట, న్యూస్‌టుడే: శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అంతకు ముందు బ్యాలెట్‌ పత్రాలు ఉపయోగించి ఓటుహక్కు వినియోగించుకునే విధానం అమలులో ఉండేది. బ్యాలెట్‌ పత్రాలపై అభ్యర్థి పేరు, అతనికి కేటాయించిన గుర్తుపై ముద్ర వేయడం ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేవారు. అయితే 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రంపై ఎలాంటి ముద్ర వేయకుండానే ఎన్నికలు నిర్వహించారు. భారత ప్రథమ ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ నేతృత్వంలో దేశంలోని 489 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ప్రతి పార్టీకి ఒక గుర్తును కేటాయించి బ్యాలెట్‌ పత్రాలపై ముద్రించారు. అదే విధంగా వివిధ గుర్తులు కలిగిన బ్యాలెట్‌ పెట్టెలను పోలింగ్‌ కేంద్రంలో విడివిడిగా ఏర్పాటు చేశారు. ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉంటే అన్ని బ్యాలెట్‌ పెట్టెలను ఉపయోగించారు. ఓటర్లు తమకు నచ్చిన గుర్తుకు సంబంధించిన పెట్టెలో ఎలాంటి ముద్ర వేయకుండానే బ్యాలెట్‌ పత్రాన్ని వేసేవారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ పెట్టెల్లో ఉన్న ఓట్లను లెక్కించి విజేతను నిర్ణయించేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని