logo

ఈవీఎంల వయసు 35 ఏళ్లు

ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం.

Published : 29 Apr 2024 05:19 IST

1989లో తొలిసారి వినియోగం
2018 నుంచి వీవీప్యాట్‌ అనుసంధానం

ఎన్నికల్లో పోలింగ్‌ కోసం ఉపయోగించే ఈవీఎం

న్యూస్‌టుడే, అచ్చంపేట: ప్రస్తుతం ఎన్నికల్లో పోలింగ్‌ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను వినియోగిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈవీఎంలను తొలిసారి ఎప్పుడు వినియోగించారు? దాని పుట్టు పూర్వోత్తరాలను ఒకసారి పరిశీలిద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)ను తొలిసారి 1989లో వినియోగంలోకి తెచ్చారు. అయితే అప్పట్లో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మాత్రమే వీటిని వినియోగించారు. ఆ తరువాత రాజస్థాన్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 25 నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగించి పోలింగ్‌ నిర్వహించారు. ఈవీఎంల వినియోగం ద్వారా పోలింగ్‌ నిర్వహించే విధానం సత్ఫలితాలను ఇవ్వడంతో 2001లో పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ ఈవీఎంలను వినియోగించి ఎన్నికలు నిర్వహించారు. ఆ తరువాత 2004లో దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను ఉపయోగించారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడంతో 2018 నుంచి ఓటర్లు ఎవరికి ఓటు వేశారో చూసుకునేందుకు వీవీప్యాట్‌ పరికరాన్ని ఈవీఎంకు అనుసంధానం చేశారు. బ్యాలెట్‌ యూనిట్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు నన్‌ ఆఫ్‌ ది అబోవ్‌ (నోటా)ను ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఓటర్లకు ఏ ఒక్కరూ నచ్చకపోతే నోటాపై ఓటు వేసే విధానాన్ని 2013 నుంచి ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది.


జాతీయ పార్టీగా గుర్తింపు ఎలా?

న్యూస్‌టుడే, అచ్చంపేట: ఈవీఎంలలో జాతీయ, ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను వరుస క్రమంలో నమోదు చేస్తారు. ఎన్నికల నామపత్రాల సమయంలోనూ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. ఈ పదాలను తరచుగా ఉపయోగిస్తున్నా చాలా మందికి జాతీయ, ప్రాంతీయ పార్టీలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. జాతీయ పార్టీలు రాజధాని కేంద్రంగా వ్యవహారాలను నడిపిస్తూ కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తుంటాయి. ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కృషి చేస్తుంటాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపుతోపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గుర్తులను కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ.. ఏవైనా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లోని పోలైన మొత్తం ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం ఇస్తుంది. ఒకే రాష్ట్రంలో పోలైన ఓట్లలో ఆరు శాతం సాధిస్తే ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీల్లో చీలికలు ఏర్పడి విడిపోతాయి. సిద్ధాంతపరంగా లేదా వ్యక్తుల కారణంగా ఒక రాజకీయ పార్టీలో చీలిక ఏర్పడినప్పుడు పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం నెలకొన్నప్పుడు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకొని చట్టప్రకారం ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది.


ఓటరు చేతికి సమస్త సమాచారం

న్యూస్‌టుడే- కోస్గి న్యూటౌన్‌, రాజోలి: ఓటర్లకు పోలింగ్‌ చీటీలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. మార్గదర్శి(గైడ్‌), కరపత్రాలు, గోడపత్రిలకలు ముద్రించి ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.

  • సాధారణంగా చీటీలను ఎన్నికలకు వారం, పది రోజుల ముందుగా చేపట్టేవారు. సమయం సరిపోక అవస్థలు పడాల్సి వచ్చేది. ఈ సారి 17 రోజుల ముందుగానే ప్రారంభించారు. చీటీలో ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, పోలింగ్‌ కేంద్రం పేరు, సంఖ్య, చిరునామా, ఓటరు జాబితాలోని సంఖ్య తదితర వివరాలతో పాటు సంబంధిత బీఎల్వో పేరు, సెల్‌ఫోన్‌ నంబరు, ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, పోలింగ్‌ రోజున ఓటర్లు పాటించాల్సిన నిబంధనలు ఈ చీటీలో పొందుపరిచారు. ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌, 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ముద్రించి ఉంది. మే 8 నాటికి చీటీల పంపిణీ పూర్తిచేయాలని ఎన్నికల సంఘం గడువు విధించిందని కోస్గి తహసీల్దారు బక్క శ్రీనివాసులు ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

ఓటరు గైడ్‌: ఈ సారి ఓటరు గైడ్‌ పుస్తకం ప్రతి ఇంటికీ చేరేలా ప్రణాళిక రూపొందించారు. 15 పేజీల పుస్తకంలో అనేక అంశాలు పొందుపరిచారు. ముఖ్యంగా కొత్త ఓటరుగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి.? ఎప్పుడు చేసుకోవాలో వివరించారు. ఓటరు జాబితాలో పేర్లు పరిశీలించుకోవడం ఎలాగో వివరించారు. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు ఏలాంటి గుర్తింపు కార్డులు తీసుకుపోవచ్చు. ఏవి తీసుకుపోకూడదో వివరించారు. పోలింగ్‌ బూత్‌లో ప్రక్రియ ఎలా సాగుతుంది. ఓటు వేసే విధానం గురించి క్షుణ్ణంగా తెలిపారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన వివిధ యాప్‌లు, కల్పిస్తున్న సౌకర్యాలు, పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం, చివరగా తప్పకుండా ఓటు వేస్తానంటూ ఓటరు ప్రతిజ్ఞ అందులో పొందుపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని