logo

గోదాం అగ్నిప్రమాదం బాధ్యులెవరు?

ఏప్రిల్‌ ఒకటో తేదీన పెబ్బేరులోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోదాంలో మిల్లర్లు నిల్వ చేసిన సీఎంఆర్‌ ధాన్యం, పౌరసరఫరాలశాఖకు చెందిన గోనె సంచులు భారీగా కాలిపోయాయి.

Published : 08 May 2024 02:41 IST

37 రోజులు దాటినా నిందితులను గుర్తించలే
రాజకీయ పెద్దలు, మిల్లర్ల హస్తం ఉందనే ఆరోపణలు

పెబ్బేరు, న్యూస్‌టుడే : ఏప్రిల్‌ ఒకటో తేదీన పెబ్బేరులోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గోదాంలో మిల్లర్లు నిల్వ చేసిన సీఎంఆర్‌ ధాన్యం, పౌరసరఫరాలశాఖకు చెందిన గోనె సంచులు భారీగా కాలిపోయాయి. 12.85 లక్షల గోనె సంచులు, 23 వేల సీఎంఆర్‌ ధాన్యం బస్తాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం. రూ.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రమాదం జరిగి 37 రోజులు పూర్తయ్యాయి. విచారణ పేరుతో అధికారులు కాలం వెళ్లదీస్తున్నారే తప్ప.. ప్రమాదం ఎలా జరిగింది.. నిందితులు ఎవరన్నదీ ఇంకా తేల్చలేదు. వారం రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది.

గోనె సంచులు పక్కదారి పట్టించడంతోనే.. : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా పెబ్బేరు, గోపాల్‌పేట చిట్యాల గోదాముల్లో కొత్తగా వచ్చిన గోనె సంచులను నిల్వ చేశారు. పెబ్బేరు గోదాంలో 12.85 లక్షలు, గోపాల్‌పేటలో 25.37 లక్షలు, చిట్యాలలో 3.20 లక్షల సంచులను భద్ర పరిచారు. పెబ్బేరు గోదాంకు ఎలాంటి భద్రత, నిఘా నేత్రాలు లేకపోవడంతో ఇక్కడి నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల అండ, రాజకీయ పెద్దల సహకారంతో జిల్లాలోని మిల్లర్ల యజమానులు సుమారు 6 లక్షల గోనె సంచులను పక్క జిల్లాలకు తరలించారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. వాటికి బీమా సౌకర్యం ఉండటంతో పక్కదారి పట్టించిన విషయం బయట పడకూడదనే ఉద్దేశంతో నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. గోపాల్‌పేట గోదాం నుంచి రాత్రి పూట మిల్లర్ల యజమానులు అధికారుల సహకారంతో గుట్టుచప్పుడు కాకుండా సంచులు తీసుకెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.


విచారణ జరుగుతోంది : అధికారులు

గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పౌరసరఫరాల సంస్థ డీఎం, పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఎన్నికలు ఉండటంతో బిజీగా ఉన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేయించి చర్యలు చేపట్టే విధంగా చూస్తాను.

నగేశ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన గోనె సంచులను బీమా సంస్థ వారు పరిశీలించి అంచనా వేసి బీమా కోసం ఫైల్‌ చేశారు. బీమా ఎంత శాతం వస్తుందో వివరాలు రాలేదు.

బాలు నాయక్‌, అదనపు డీఎం, పౌరసరఫరాల సంస్థ

కొత్తకోట సీఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సుమారు 20 మందిని విచారణ చేశాం. గోదాంలో పనిచేసే హమాలీలు, గంజాయి, మద్యం తాగే వారిని, అక్కడ పనిచేసే ఉద్యోగులను విచారించాం. విచారణ ఇంకా కొనసాగుతోంది.

హరిప్రసాద్‌రెడ్డి, ఎస్సై, పెబ్బేరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు