logo

రెడ్‌కో దెబ్బ.. పంచాయతీలు అబ్బా!

పరిమిత గ్రామాలలో మాత్రమే మూడోలైన్‌ ఏర్పాటుచేసి వాటికి మీటర్లు బిగించారు. చాలా గ్రామాలలో మూడోలైన్‌ ఏర్పాటు చేయకుండా వీధిదీపాలు అమర్చి వదిలేశారు. ఆయా గ్రామాల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధిదీపాలు వెలుగుతున్నాయి.

Updated : 08 May 2024 06:45 IST

మూడోలైన్‌ వేయని వైనం
విద్యుత్తు బిల్లులు తడిసి మోపెడు
న్యూస్‌టుడే, కృష్ణా

గ్రామాలలో వీధి దీపాలు నిర్వహించడానికి ఏడేళ్లపాటు ఒప్పందం చేసుకున్న టీఎస్‌ రెడ్‌కో సంస్థ మధ్యలోనే చేతులెత్తేసింది. వీధిదీపాల నిర్వహణ కోసం అన్ని గ్రామాలలో మూడోలైన్‌ ఏర్పాటుచేసి దీపాలను ఆన్‌ ఆఫ్‌ చేసేలా ఆ సంస్థ ఏర్పాటు చేయాలి. విద్యుత్తు బిల్లులు తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావించారు.

పరిమిత గ్రామాలలో మాత్రమే మూడోలైన్‌ ఏర్పాటుచేసి వాటికి మీటర్లు బిగించారు. చాలా గ్రామాలలో మూడోలైన్‌ ఏర్పాటు చేయకుండా వీధిదీపాలు అమర్చి వదిలేశారు. ఆయా గ్రామాల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధిదీపాలు వెలుగుతున్నాయి. పంచాయతీలకు వచ్చే విద్యుత్తు బిల్లు పేలిపోతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఆర్థిక వనరుల్లేక కునారిల్లుతున్న పంచాయతీలు విద్యుత్తు బిల్లుల దెబ్బకి మరింత కుంగిపోతున్నాయి. ఒక్కో పంచాయతీకి నెలకు రూ.70 వేల వరకు బిల్లు రావడంతో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే నిధుల్లో సింహభాగం విద్యుత్తుశాఖకు చెల్లించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా ఆయా గ్రామాలలో ఎల్‌ఈడీ దీపాలు కాలిపోతే వేయడానికి లేకుండా పోతోందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. ఏడేళ్ల నిర్వహణకు ఒప్పుకున్న సంస్థ ఏడాది కూడా చేయకుండానే మధ్యలో వదిలేసింది..

ఈఈఎస్‌ఎల్‌ ద్వారా ఎల్‌ఈడీ బల్పులు: నారాయణపేట జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటుకు ఈఈఎస్‌ఎల్‌ సంస్థకు అప్పగించారు. బల్బుల ఏర్పాటు ఈ సంస్థ చేయగా, నిర్వహణ టీఎస్‌రెడ్‌కో చూస్తుంది. మూడో లైన్‌ ఏర్పాటు ద్వారా పట్టపగలు వీధిదీపాలు వెలగకుండా చూడాల్సిన బాధ్యత టీఎస్‌ రెడ్‌కోదే. విద్యుత్తు అధికారుల సమన్వయంతో మూడోలైన్లు కొంత మేరకు ఏర్పాటు చేసి, అర్థాంతరంగా వదిలేశారు. అందులో పనిచేస్తున్న సైట్‌ ఇంజినీర్లను తొలగించారు. ఈ సంస్థ చేపట్టిన పనులపై గతంలో ఆడిట్‌ నిర్వహిస్తారని చెప్పినా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో నాసిరకం బల్పులు, సీసీఎంఎస్‌ బాక్సులు సరఫరా అయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. సీసీఎంఎస్‌ బాక్సులు ప్రస్తుతం ఎక్కడా పని చేయడం లేదు. వాటి స్థానంలో పంచాయతీ కార్యదర్శులు ఫీజు బాక్సులు ఏర్పాటు చేసి విద్యుత్‌ దీపాలు ఆర్పడానికి ఏర్పాట్లు చేశారు.

మూలన పడ్డ మీటర్లు: ఎల్‌ఈడీ వీధిదీపాలు అమర్చిన ఈఈఎస్‌ఎల్‌ అయా గ్రామాలలో విద్యుత్తు వినియోగాన్ని గుర్తించడానికి మీటర్లు బిగించే ఏర్పాటు చేసింది.. వాటికి నంబర్లు వేసి నేరుగా పంచాయతీ కార్యదర్శులకు నెలవారీ ఎన్ని యూనిట్లు ఖర్చు చేసిందీ గుర్తించి బిల్లు ఆన్‌లైన్‌ ద్వారా అందే ఏర్పాటు చేసింది. వచ్చిన బిల్లును పంచాయితీ నిధుల నుంచి చెక్కుల ద్వారా విద్యుత్‌శాఖకు అందచేస్తున్నారు. విద్యుత్తు బిల్లు అధికంగా రావడంతో చాలా గ్రామ పంచాయితీలలో మీటర్లను నిలిపి వేశారు. కొన్నిచోట్ల మీటర్లు కాలిపోయినట్లు సమాచారం. దీంతో గతంలో వచ్చిన బిల్లు ఆధారంగా  బిల్లు పంపిస్తున్నారు.


మూడోలైన్‌పై నివేదించాం

- ధర్మతేజ, విద్యుత్తుశాఖ, ఏఈ

వీధిదీపాల కోసం చాలా చోట్ల మూడోలైన్‌ ఏర్పాటు చేశాం.. 40 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. ఏఏ గ్రామాలలో ఏర్పాటు చేయాలన్న వివరాలు నమోదు చేసి ఉన్నతాధికారులకు పంపించాం..ఎన్నికల అనంతరం పనులు ప్రారంభమవుతాయి. చాలా పంచాయతీలలో వీధిదీపాలకు సంబంధించిన మీటర్లు పని చేయడం లేదని మా దృష్టికి వచ్చింది. కాలిపోయిన మీటర్ల స్థానంలో కొత్తవి బిగించే ఏర్పాటు చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు