logo

పాఠశాల ప్రారంభం రోజే పుస్తకాలు

సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్‌ నెలలో పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేయడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

Updated : 08 May 2024 06:46 IST

జిల్లాకు 1.25 లక్షల పాఠ్య పుస్తకాలు రాక..

కందనూలు, న్యూస్‌టుడే : సర్కారు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జూన్‌ నెలలో పాఠశాలలు ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేయడానికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ముద్రణ కేంద్రంలో ముద్రించిన పాఠ్య పుస్తకాలను జిల్లాకు పంపిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు జూన్‌లో పాఠశాలలు ప్రారంభమైనా ఆలస్యంగా పుస్తకాలు రావడం వలన ఉపాధ్యాయులు ఆగస్టు నెల వరకు పుస్తకాలు అందజేశారు. దీని వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన పాఠ్య పుస్తకాలను పట్టణంలోని పాత డీఈవో కార్యాలయంలోని గోదాంలో భద్రపరుస్తున్నారు. త్వరలోనే వివిధ మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను పంపించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తెలుగు, ఆంగ్ల భాషల్లో పాఠ్యాంశాలు..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే పుస్తకాల్లో ఓ వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లంలో ముద్రిస్తున్నారు. విద్యార్థులకు తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లంలో సులువుగా అర్థం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు భాషల్లో పుస్తకాలు ముద్రిస్తోందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పాఠ్యపుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌, ప్రతి దానిపైన ఒక వరుస సంఖ్య ముద్రించడంతో పుస్తకాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించినా సులువుగా గుర్తించవచ్చని అధికారులు తెలిపారు.


విద్యార్థుల సంఖ్యను బట్టి..

జిల్లాలోని ప్రభుత్వ విభాగానికి సంబంధించి 875 పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 74,446 మంది విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి జిల్లాకు 6.50 లక్షల పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.25 లక్షల పుస్తకాలు వచ్చాయి. మిగిలిన 5.25 లక్షల పుస్తకాలు ఈనెల 25 తేదీ వరకు వచ్చే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ముద్రణ కేంద్రం నుంచి రెండు, మూడు రోజులకోసారి లక్ష పుస్తకాలు వస్తున్నాయని, జిల్లాకు పూర్తి స్థాయిలో పుస్తకాలు వచ్చిన వెంటనే మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కేంద్రాలకు పంపిస్తామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


ఏర్పాట్లు చేస్తున్నాం

- గోవిందరాజులు, జిల్లా విద్యాశాఖ అధికారి

జిల్లా కేంద్రానికి వచ్చిన పాఠ్యపుస్తకాలను మండలాలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల చివరిలోపు మొత్తం పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇబ్బందులు కల్గకుండా పాఠశాల ప్రారంభం రోజునే పుస్తకాలు అందిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు