logo

ఆసరా ఆలస్యం!

ఆర్థికంగా ఏ అండదండలు లేని వారికి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలుచేస్తోంది. లబ్ధిదారులకు ప్రతినెలా పింఛను ఇస్తోంది. ఇది మంచి పథకమే అయినా సాయం కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.

Published : 23 May 2022 02:12 IST

ప్రతి నెలా ఇదే తీరు
లబ్ధిదారులకు తప్పని అవస్థలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

ర్థికంగా ఏ అండదండలు లేని వారికి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆసరా పథకాన్ని అమలుచేస్తోంది. లబ్ధిదారులకు ప్రతినెలా పింఛను ఇస్తోంది. ఇది మంచి పథకమే అయినా సాయం కోసం లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు. డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని ఒకటో తారీకు నుంచి బ్యాంకులు, తపాలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ నెలలోనూ ఇప్పటివరకు అందలేదు.

1.35 లక్షల మంది: జిల్లాలో 1,35,289 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వితంతువులు 65,149 మంది ఉండగా వృద్ధులు 44,234 మంది. జిల్లాకు ప్రతినెలా రూ.30 కోట్లు విడుదలవుతాయి. దివ్యాంగులకు నెలకు రూ.3,016  మిగతా వారికి రూ.2,016 ఇస్తున్నారు.

ఆలస్యంతో ఇక్కట్లు: పింఛను తరచూ ఆలస్యంగా ఇవ్వడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరకుల కొనుగోలుకు వీటిపైనే ఆధారపడిన వారి పరిస్థితి దయనీయం. మార్చిలో 15వ తేదీ తర్వాత డబ్బు విడుదలైంది. ఈనెలకు సంబంధించి ఇప్పటివరకు అందలేదు. గతంలో ప్రతినెలా 10వ తేదీలోగా బట్వాడా పూర్తయ్యేది. ఇటీవల 15వ తేదీ తర్వాతే డబ్బులు వస్తుండటం గమనార్హం.

బ్యాంకులకు చేరేదెప్పుడో?
తపాల శాఖ ద్వారా పింఛను అందుకుంటున్న వారు జిల్లాలో 44 వేల మంది ఉన్నారు. మిగతా వారికి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. ఈనెలకు సంబంధించి తపాల కార్యాలయాల ద్వారా పొందుతున్న వారికి నిధులు విడుదలయ్యాయని, బ్యాంకుల్లో నేరుగా జమయ్యే వారికి మాత్రం విడుదల కాలేదని అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా 20వ తేదీ దాటినా డబ్బులు చేతికందక లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు వాస్తవమే: రంగాచార్యులు, ఏపీవో పింఛన్లు
ఆసరా పింఛను ఆలస్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. ఆలస్యమైనా ప్రతినెలా నిధులు విడుదలవుతున్నాయి. తపాల ద్వారా అందుకుంటున్న వారికి  సోమవారం పంపిణీ ప్రారంభమవుతుంది. బ్యాంకుల నుంచి పొందేవారికి రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని