logo

రుణం అందక.. ఉపాధి లేక..!

స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు రుణాలిస్తామని బీసీ కార్పొరేషన్‌ ప్రకటించడంతో కొండంత ఆశతో యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. కొంత మందికి రుణాలు అందజేసి మిగతా వారికి నిలిపివేశారు.

Updated : 25 May 2022 04:28 IST

బీసీ కార్పొరేషన్‌ తీరుతో యువతకు తప్పని నిరీక్షణ


గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్న యువకులు

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట: స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకునేందుకు రుణాలిస్తామని బీసీ కార్పొరేషన్‌ ప్రకటించడంతో కొండంత ఆశతో యువతీయువకులు దరఖాస్తు చేసుకున్నారు. కొంత మందికి రుణాలు అందజేసి మిగతా వారికి నిలిపివేశారు. నాలుగేళ్లుగా ఇదే తీరు కొనసాగుతుండటంతో నిరాశ చెందుతున్నారు. రుణం వస్తుందో రాదో తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్‌ రాయితీ రుణాలకు  అన్ని మండలాల నుంచి  వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తులను ఆహ్వానించారు. కేటగిరీ-1లో రూ.లక్ష, కేటగిరీ-2లో రూ.2 లక్షలు, కేటగిరీ-3లో రూ.3 లక్షలు అంతకంటే ఎక్కువ కేటాయించారు. కేటగిరీల వారీగా రాయితీ 80 శాతం వరకు నిర్ణయించారు. ఈ క్రమంలో మొదటి కేటగిరీలోని దరఖాస్తులకు రూ.లక్షకు బదులుగా శతశాతం రాయితీతో రూ.50 వేలు అందించాలని నిర్ణయించి బడ్జెట్‌ విడుదల చేశారు. జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల వారీగా సభలు పెట్టి అర్హులను గుర్తించారు. ఈ సభల్లో 20 వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా 18,624 మందిని అర్హులుగా గుర్తించారు. వారి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు.

850 మందికి మాత్రమే..

జిల్లాలో రూ.లక్ష విలువైన యూనిట్‌ మంజూరుకు దరఖాస్తు చేసుకున్న  850 మంది లబ్ధిదారులకు రూ.50 వేల యూనిట్లను పూర్తి రాయితీతో 2018, ఆగస్టులో అందజేశారు. అనంతరం మిగతా యూనిట్‌లకు సంబంధించి వరుస ఎన్నికలు రావడంతో ఆటంకం ఏర్పడి... ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పంపిణీలో జాప్యం ఏర్పడింది. దీంతో ఇప్పటికీ 17,774 మందికి  ఎలాంటి రుణాలు అందక.. ఎదురుచూస్తున్నారు. గతంలో వార్షిక ప్రణాళిక ప్రకటించి రుణాలను అందజేసేవారు. నాలుగేళ్లుగా ఆ ప్రస్తావన లేకుండా పోయింది. బీసీ రుణ పంపిణీకి ప్రభుత్వం నిధులు విడదుల చేయకపోవడం లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికైనా  అందజేస్తే ఉపాధికి ఆసరా ఉంటుందని పలువురు కోరుతున్నారు. గతంలో ఏడాది, రెండోళ్లకోసారి బీసీ కార్పోరేషన్‌ ద్వారా పంపిణీ చేసేవారు. నాలుగేళ్లుగా పంపిణీకి బ్రేక్‌ పడటంతో రుణాల పంపిణీ ఉంటుందా లేదా అన్నది దరఖాస్తుదారుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.  


ఎటువంటి ఆదేశాలు రాలేదు
- కేశవ్‌రామ్‌ జిల్లా బీసీ సంక్షేమాధికారి

బీసీ రుణాల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక నిర్వహించి.. కొంత మందికి అందించాం. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో మధ్యలోనే పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం విడుదల చేస్తే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు.


ఎప్పుడిస్తారో...
- విశ్వనాథం, బుజ్రాన్‌పల్లి

2018లో దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు మంజూరు ఊసేలేదు. కొంత మందికి రుణాలు ఇచ్చి మిగతా వారికి ఆపేశారు. నాలుగేళ్లు దాటిపోయినా రుణాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మిగతా పథకాలు అమలు చేసినట్లే బీసీ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి పంపిణీ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు