logo

రహదారులకు మహర్దశ

అధ్వానంగా మారిన రహదారులు.. వాటిపై ప్రయాణం నరకం.. ఏ సమయంలో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.. చూస్తే తారు రోడ్డు కానీ అడుగడుగునా గుంతలు, తేలిన కంకర.. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. గుంతలమయమైన రోడ్లకు

Published : 05 Jul 2022 01:48 IST

జిల్లాలో మరమ్మతులకు రూ.84.14 కోట్లు

తీరనున్న ఇక్కట్లు

న్యూస్‌టుడే, చేగుంట, అల్లాదుర్గం

చిన్నశివునూర్‌ - పెద్దశివునూర్‌ రోడ్డు ఇలా..

ధ్వానంగా మారిన రహదారులు.. వాటిపై ప్రయాణం నరకం.. ఏ సమయంలో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.. చూస్తే తారు రోడ్డు కానీ అడుగడుగునా గుంతలు, తేలిన కంకర.. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి. గుంతలమయమైన రోడ్లకు ఎప్పుడు మోక్షం వస్తుందోననే ప్రజలు ఆశగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇలాంటి రహదారులకు మోక్షం లభించింది. రోడ్ల బాగుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం విశేషం.


గుంంతలమయంగా వెంకట్‌రావుపేట - జగిర్యాల మార్గం

జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి. వీటిపై వెళ్లాలంటేనే భయంగా ఉండేవి. ఇలాంటి వాటిని బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో ఉన్న పీఆర్‌ రోడ్లపై రీబీటీ వేయాలని సంకల్పించారు. మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాలతో పాటు చేగుంట, నార్సింగి, టేక్మాల్‌, పెద్దశంకరంపేట, రేగోడ్‌, అల్లాదుర్గం, తూప్రాన్‌ మండలాల పరిధిలోని రోడ్లకు మంజూరు చేశారు. తారు దారుల అభివృద్ధికి రూ.84.14 కోట్లు కేటాయించారు. దీనివల్ల పలు గ్రామాలను కలుపుతూ ఉన్న రోడ్లు బాగుకానున్నాయి. మెదక్‌ నియోజకవర్గానికి 29 రోడ్లకు రూ.25 కోట్లు, నర్సాపూర్‌ నియోజకవర్గానికి 22 రోడ్లకు రూ.35 కోట్లు విడుదలయ్యాయి. అలాగే దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంట మండలంలో ఆరు రోడ్లకు రూ.3.10 కోట్లు, నార్సింగి మండలంలో 2 రోడ్లకు రూ.1.44 కోట్లు మంజూరు చేశారు. ఆందోల్‌ నియోజకవర్గంలోని టేక్మాల్‌, రేగోడ్‌, అల్లాదుర్గం మండలాలకు రూ.17.13 కోట్లు వచ్చాయి. గజ్వేల్‌ నియోజకవర్గంలోని తూప్రాన్‌ మండలానికి రూ.2.47 కోట్లు వచ్చాయి.

దశాబ్దాల క్రితం..

జిల్లాలో పలు పీఆర్‌ రోడ్లకు దశాబ్దాల క్రితం మరమ్మతులు చేపట్టారు. తర్వాత వాటి జోలికి వెళ్లలేదు. దీంతో గుంతలు ఏర్పడటంతో కంకర తేలింది. అంతేకాకుండా గ్రామీణ తారు దారులపై రైతులు దమ్ము చక్రాల ట్రాక్టర్లను నడపడం వల్ల మరింత అధ్వానంగా మారాయి. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణం కష్టంగా మారింది. ముఖ్యంగా రాత్రివేళ వెళ్లాలంటే భయాందోళన తప్పని పరిస్థితి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరింత దారుణంగా మారాయి. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను వేరే చోటికి తరలించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇలాంటి రోడ్ల మరమ్మతులకు నిధులు అవసరమని కావాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికుమార్‌లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దీంతో ప్రభుత్వం ఆయా వాటిని ఆమోదం తెలుపుతూ నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపింది. ఇక టెండర్లు పిలవడమే ఆలస్యం.


త్వరితగతిన పనులు

- నర్సింలు, రాధికాలక్ష్మి, పీఆర్‌ డీఈఈలు తూప్రాన్‌, నర్సాపూర్‌

పీఆర్‌ రోడ్ల మరమ్మతులకు నిధులు రావడం వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. ప్రస్తుతం వచ్చిన పనులకు టెండర్లు పిలవనున్నాం. ఈ ప్రక్రియ పూర్తిచేసిన తర్వాత పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని