logo

లక్ష్యం.. ఆరోగ్య బాల్యం

రాబోయేతరం ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది.

Published : 30 Nov 2022 05:27 IST

ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ కార్యక్రమానికి కసరత్తు

అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: రాబోయేతరం ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. పోషణలోపంతో సతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీనిని అధిగమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకు అనుగుణంగా పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార (ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ) కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.

జిల్లాలో నారాయణఖేడ్‌, జోగిపేట, జహీరాబాద్‌, పటాన్‌చెరు, సదాశివపేటలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. కేంద్రాల పర్యవేక్షణ అక్కడినుంచే జరుగుతోంది. ఆయా ప్రాజెక్టుల పరిధిలో 1,504 కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 94,486 మంది ఆరు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారు.

ఇదీ పరిస్థితి: అక్టోబరులో చిన్నారుల ఎత్తు, బరువు నమోదుచేశారు. వీటి ఆధారంగా మధ్యస్థ లోప పోషణ చిన్నారులు 2,524 మంది, 537 మందికి అతి తీవ్రంగా ఉన్నట్లు గుర్తించారు. వీరిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకుసాగుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 10 జిల్లాల్లో అమలవుతున్న పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని అన్ని జిల్లాలో అమలుచేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.  

కార్యాచరణ ఇలా: మధ్యస్థ, అతి తీవ్ర పోషణలోపం ఉన్న చిన్నారుల వివరాలను ప్రస్తుతం నమోదు చేస్తున్నారు. వీరికి కేంద్రంలో ఆకలి పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అనుత్తీర్ణులైన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపుతారు. అక్కడ చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎస్‌ఎస్‌ఎఫ్‌పీలో భాగంగా అవసరమైన మందులు ఇప్పించడంతోపాటు బాలామృతం ప్లస్‌ను అందజేస్తారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లోనే పౌష్టికాహారం తయారుచేసే విధానాన్ని వివరిస్తున్నారు.


చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం
పద్మావతి, జిల్లా సంక్షేమాధికారిణి

చిన్నారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందులో భాగంగా చిన్నారులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నాం. తీవ్ర పోషణలోపం ఉన్నవారికి అదనపు ఆహారం, బాలామృతం ప్లస్‌ అందనుంది. కేంద్రంలో తల్లులతో సమావేశాలు నిర్వహించి వారి పిల్లల పరిస్థితిని ఇప్పటికే వివరిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు