logo

చూపులకు చిన్న.. పోషకాల్లో మిన్న

చిరుధాన్యాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒకప్పుడు ఏ ఇంట చూసినా వీటికి కొరత ఉండేది కాదు.

Published : 03 Feb 2023 01:03 IST

అవగాహన కల్పనకు ఎన్‌వైకే చర్చా వేదికలు

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: చిరుధాన్యాల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒకప్పుడు ఏ ఇంట చూసినా వీటికి కొరత ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొనుగోలు చేసే వారు లేకపోవడంతో రైతులు సైతం వీటిని వదిలేసి వాణిజ్య పంటల సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. చిరుధాన్యాల వినియోగాన్ని తగ్గించడంతో ఆరోగ్యపరంగా సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం మళ్లీ వీటివైపు దృష్టి సారించింది. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం ఇందులో భాగమే.

మాట్లాడుతున్న రామచంద్రారావు, వేదికపై ప్రవీణ, రంజిత్‌రెడ్డి, సాయిభాస్కర్‌, తదితరులు


సాగు పెంపే లక్ష్యం

ప్రస్తుత పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగు పెంచేలా, వీటి వినియోగం పెరిగేలా చేయాలన్న లక్ష్యంతో నెహ్రూ యువకేంద్రం నడుంబిగించింది. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలిసారిగా సంగారెడ్డి కలెక్టరేట్‌లో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమన్వయంతో గురువారం యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీ 20 దేశాల సదస్సుకు భారత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. చిరుధాన్యాల అంశాన్ని ప్రధానంగా తీసుకుని చర్చావేదిక నిర్వహించగా యువతను ఆలోచింపజేసేదిగా సాగింది. యువజన, క్రీడల శాఖ అధికారి రామచంద్రారావు, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రవీణ, నెహ్రూ యువకేంద్రం అధికారి రంజిత్‌రెడ్డి, కౌన్సిల్‌ ఫర్‌ ఎర్త్‌ లీడర్‌షిప్‌ అండ్‌ సస్టనేబులిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయిభాస్కర్‌, డీడీఎస్‌ శాస్త్రవేత్త రమేశ్‌, తదితరులు పాల్గొని చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో వివరించారు.


జిల్లాల వారీగా కార్యాచరణ

యూత్‌ పార్లమెంట్‌లో భాగంగా చిరుధాన్యాల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై యువతలో అవగాహన పెంపొందించనున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెదక్‌, సిద్దిపేటలోనూ నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. డిగ్రీ స్థాయి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని గుర్తించేలా చర్చా వేదికలకు రూపకల్పన చేశారు. జిల్లా కేంద్రాల్లో జరిగే చర్చావేదికలో పాల్గొనే విద్యార్థులందరికీ ధ్రువపత్రాలు సైతం అందించనున్నారు. యూత్‌ పార్లమెంట్‌లో చర్చించిన అంశాలను తమ గ్రామ స్థాయిలో చర్చకు వచ్చేలా చూడాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నారు.


ఆసక్తికర చర్చ

యూత్‌ పార్లమెంట్‌లో భాగంగా జీ 20 సమావేశాలు, పర్యావరణ పరిరక్షణ, చిరుధాన్యాల ప్రాధాన్యతపై చర్చించారు. ప్రతిపక్షాలు, పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలపై జరిగిన చర్చలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పాలకపక్షాన్ని సమర్థించగా మరికొందరు ప్రభుత్వ విధానాలు వ్యతిరేకించారు. ఇరుపక్షాల తమ వాదనలతో ఎవరికి వారు తామే పైచేయి సాధించేందుకు పోటీపడ్డారు. ప్రస్తుత రాజకీయాలపై వాడీవేడీ చర్చలతో పార్లమెంటు సమావేశాలను తలపించారు.
యువతలో చైతన్యంతోనే మార్పు: రంజిత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా నెహ్రూ యువకేంద్ర అధికారి
ఏదైనా మార్పు రావాలంటే యువతతోనే సాధ్యం. ఇదే ఉద్దేశంతో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని యువతకు అవగాహన కల్పిస్తాం. ప్రస్తుత యాంత్రిక జీవనంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. పంటల సాగులో చిరుధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ పంట ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు