logo

సమాజ హితం.. ఐఐటీహెచ్‌ లక్ష్యం!

సాంకేతికతను అందిపుచ్చుకుంటే వేగంగా, కచ్చితత్వంతో కొన్ని రకాల వ్యాధులను ఆదిలోనే గుర్తించొచ్చు. ఈ దిశగా ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధనలు సాగుతున్నాయి.

Published : 05 Feb 2023 02:04 IST

మానవాళికి మేలు చేసే పరిశోధనలపై దృష్టి
తాజాగా విడుదల చేసిన ‘కిరీట్‌’ ఉద్దేశం ఇదే..

 

ఈనాడు, సంగారెడ్డి: సాంకేతికతను అందిపుచ్చుకుంటే వేగంగా, కచ్చితత్వంతో కొన్ని రకాల వ్యాధులను ఆదిలోనే గుర్తించొచ్చు. ఈ దిశగా ఐఐటీ హైదరాబాద్‌లో పరిశోధనలు సాగుతున్నాయి. సంబంధిత పరికరాలను మార్కెట్‌లోకి అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. డెంగీ, మలేరియా, కరోనాతో పాటు వంద గంటల ముందే గుండెపోటును గుర్తించేలా సెన్సార్ల ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను వినియోగిస్తున్నారు. మానవాళికి మేలు చేసే పరిశోధనలపై ప్రత్యేక దృష్టిసారించి అడుగులు వేస్తున్నారు.


వ్యాధుల నిర్ధారణ..

సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు, రుగ్మతలకు సంబంధించి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో సరైన సదుపాయాలు ఉండవు. అలాంటి చోట కూడా స్థానికంగానే తక్కువ ఖర్చుతో వీటి నిర్వహణకు వీలుంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇవే విషయాలను తాజాగా విడుదల చేసిన ఐ-కిరీట్‌ మ్యాగజైన్‌లో వారు పొందుపరిచారు.


పదమూడో సంచిక

మూడేళ్లుగా ఐఐటీ ఆధ్వర్యంలో కిరీట్‌ సంచికను విడుదల చేస్తున్నారు. మూడునెలలకొకటి చొప్పున గతేడాది వరకు 12 సంచికలు అందుబాటులోకి తెచ్చారు. ఇది పదమూడోది. ప్రతిసారీ ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకొని పరిశోధనలతో పాటు కీలక విషయాలు అందులో ప్రస్తావిస్తారు. ఇప్పటి వరకు కృత్రిమమేధ, ఆరోగ్యరంగం, జపాన్‌తో ఐఐటీహెచ్‌ అనుబంధం, నానోసాంకేతికత, స్మార్ట్‌ మొబిలిటీ రకరకాల అంశాలను వివరించారు. తాజాగా విడుదల చేసిన సంచికలో సెన్సార్లు, పరికరాల అభివృద్ధి గురించి, ఐఐటీలో సాగుతున్న పరిశోధనల గురించి పేర్కొన్నారు.


కీలక అంశాలిలా..

* 55వ ఐఐటీ స్పోర్ట్స్‌మీట్‌లో ఐఐటీ హైదరాబాద్‌ 7 పతకాలు, ఒక జనరల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించి ఆరోర్యాంకులో నిలిచింది. షాట్‌పుట్‌తో మూడు బంగారు పతకాలు రావడం విశేషం.* ఈ మూడు నెలల కాలంలో సుజుకీ మోటారు కార్పొరేషన్‌, హెక్సాగాన్‌, శ్రీ విశ్వేశ్వర యోగా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. ఇలా మొత్తం 9 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయా అంశాల్లో వారితో కలిసి ఐఐటీ హైదరాబాద్‌ పని చేయనుంది.

* దేశీయంగా సిద్ధం చేసిన 5జీ సాంకేతికతను ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2022లో ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆచార్యుడు కిరణ్‌కూచి 5జీ, 6జీ సాంకేతికతల అంశమై ఐఐటీ హైదరాబాద్‌లో సాగుతున్న పరిశోధనల గురించి అక్కడ వివరించారు.


* ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ఆచార్య శివ్‌గోవింద్‌ సింగ్‌ నేతృత్వంలో డెంగీ, మలేరియా, కోవిడ్‌-19లను గుర్తించేలా ఇప్పటికే సెన్సార్లు అభివృద్ధి చేశారు. గుండెపోటు ముప్పును చాలా ముందుగానే గుర్తించే పరికరాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ప్రయోగపూర్వకంగా వీటి పనితీరును నిరూపించినా.. మార్కెట్లో ఉత్పత్తులుగా తీసుకురావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.


* ఐఐటీలో పలు విభాగాల అధిపతుల సారథ్యంలో విద్యార్థులు పరిశోధన చేపట్టి వ్యాధుల నిర్ధారణకు పరికరాలు ఆవిష్కరించారు. వాటి పనితీరును తెలుసుకునే దిశగా సాగుతున్నారు.


* పరిశ్రమల నుంచి చాలా సార్లు వాయువులు విడుదలై ప్రమాదాలకు కారణం అవుతుంటాయి. లీకేజీ తీవ్రత చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నప్పుడే గుర్తిస్తే వీటిని నివారించొచ్చు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌శర్మ సారథ్యంలో పరిశోధిస్తున్నారు. హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ చాలా తక్కువ మొత్తంలో విడుదలైనా వెంటనే గుర్తించేందుకు వీలుగా వీరు మెటల్‌ ఆక్సైడ్‌ నానోఫైబర్స్‌ను ఉపయోగించి పరికరాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.


నూతన ఆవిష్కరణ..

* పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తులు ఎక్కువ రోజులు నిల్వ చేయడం సమస్య. ఈ అంశమై మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ముద్రికా ఖండేల్‌వాల్‌ మార్గదర్శనంలో ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. సహజ వనరుల నుంచి సేకరించిన మెటీరియల్స్‌ను వీరు ప్యాకేజింగ్‌కు వాడటంతో సత్ఫలితాలు వచ్చాయి. సాధారణ పరిస్థితుల్లో కంటే ఎక్కువ రోజులు ఆహార ఉత్పత్తులు తాజాగా ఉంటున్నట్లు వీరు గుర్తించారు. ఒకవేళ ఆహార ఉత్పత్తులు పాడైపోతే ఆ ప్యాకేజింగ్‌ మెటిరీయల్‌ రంగు మారేట్లుగా వీరు ఆంథోసయనిన్‌ను ఇందుకు వినియోగించారు. వీటిపై మరింత ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని