logo

పచ్చి మిర్చి.. ఆదాయం జాస్తి

వరి పంటకు ప్రత్యామ్నాయంగా సన్నమిర్చి పంటను సాగు చేస్తూ చిన్నకోడూరు, నారాయణరావుపేట మండల రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 06 Feb 2023 01:45 IST

గంగాపూర్‌ మార్కెట్‌ యార్డులో మిర్చి సంచులు

న్యూస్‌టుడే - సిద్దిపేట అర్బన్‌, చిన్నకోడూరు: వరి పంటకు ప్రత్యామ్నాయంగా సన్నమిర్చి పంటను సాగు చేస్తూ చిన్నకోడూరు, నారాయణరావుపేట మండల రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయ పంటల వైపు అన్నదాతలు ఆసక్తి కనబరచాలని వ్యవసాయ, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్య పరిచారు. రెండు మండలాలకు చెందిన పలువురు కర్షకులు సన్న మిర్చి సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. వరికి పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. తెగుళ్ల బారిన పడుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లో గత కొద్ది సంవత్సరాలుగా మిర్చి వేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి నీటితో అధిక విస్తీర్ణంలో పంట సాగు చేసుకునే అవకాశం ఉండటంతో గంగాపూర్‌, మాచాపూర్‌, విఠలాపూర్‌, చంద్లాపూర్‌, రామంచ, గుర్రాలగొంది, జక్కాపూర్‌, మల్యాలలో అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తుంపర సేద్య పరికరాలు అవసరం కావడంతో ప్రభుత్వం రాయితీపై అందజేస్తోంది. ప్రస్తుతం రెండు మండలాల్లో 750 ఎకరాల్లో సన్న మిర్చి వేస్తున్నారు.

33 టన్నులు రాక

సన్న మిర్చి విక్రయించేందుకు గంగాపూర్‌, మాచాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేక మార్కెట్‌ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్‌లో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం గంగాపూర్‌ మార్కెట్‌కు 33 టన్నులు తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సిద్దిపేట ఉద్యాన శాఖాధికారి భాస్కర్‌రెడ్డి చెప్పారు. కొన్ని మండలాల్లోనే మిరపకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకా పెరగాల్సి ఉంది. మార్కెట్‌ సౌకర్యం ఉండటంతో ధర పలుకుతోంది. దృష్టి పెడితే ఎకరాకు రూ.1.80 లక్షల ఆదాయం పొదవచ్చని ఆయన పేర్కొన్నారు.


రూ.1.20 లక్షలు ఆదాయం
- శంకర్‌, చంద్లాపూర్‌

పది సంత్సరాలుగా మిర్చి పంట సాగు చేస్తున్నా. ఈ ఏడాది రెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన. ఎకరాకు రూ.45 వేల వరకు ఖర్చు వచ్చింది. ఇప్పటి వరకు రెండు సార్లు మిరపకాయలను తెంపిన.  గంగాపూర్‌ మార్కెట్‌లో అమ్మితే రూ.1.20 లక్షలు వచ్చాయి. ఖర్చులు పోనూ రూ.60 వేల వరకు ఆదాయం వచ్చింది. మరో ఎకరంలో రావాల్సి ఉంది. వరితో పోల్చితే దీనితోనే ఎక్కువ ఆదాయం.


ఐదేళ్లుగా ఇదే తోట
- రాజు, చౌడారం

గ్రామంలో తోటి రైతులు మిర్చి పంట సాగు చేయడం చూసి గత 5 సంవత్సరాలుగా వేస్తున్న. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో సాగైంది. రెండు దఫాలుగా కాయలు తెంపి అమ్మిన. రూ.50 వేలు చేతికందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని