logo

జలజాలం.. సమస్యల వలయం

కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు అది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నీటిఎద్దడి ఎదురవకూడదన్న లక్ష్యంతో చేపట్టిన తాగునీటి పథకం.

Published : 08 Feb 2023 02:03 IST

న్యూస్‌టుడే, మెదక్‌

జిల్లా కేంద్రంలోని మాలబస్తీలో సన్నటిధార వస్తుండగా నీటిని ఇలా పట్టుకుంటూ..

కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు అది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, నీటిఎద్దడి ఎదురవకూడదన్న లక్ష్యంతో చేపట్టిన తాగునీటి పథకం. ఐదేళ్ల పాటు పనులు కొనసాగగా, ఇష్టారీతిన చేపట్టడంతో తరచూ లీకేజీల సమస్య ఏర్పడుతోంది. ఇది జిల్లా కేంద్రం మెదక్‌లోని జలజాలం పరిస్థితి. దీంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు.

ప్రపంచ బ్యాంకు నిధులు

మెదక్‌ పట్టణవాసులకు సింగూరు, హల్దీ ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేస్తుంటారు. ఎద్దడి సమస్య తప్పించేందుకు ప్రభుత్వం జలజాలం పథకాన్ని చేపట్టింది. 2017లో రాష్ట్రంలో ఐదు పురపాలికలను ఎంపిక చేయగా అందులో మెదక్‌ ఒకటి. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి తొలి విడత రూ.50 కోట్లు, మరో విడతలో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.10 కోట్లు కేటాయించారు. స్థానిక పంప్‌హౌస్‌ వద్ద 1,600 కేఎల్‌ (20 లక్షల లీటర్లు), ఖిల్లాపై 4,700 కేఎల్‌ (50 లక్షల లీటర్ల) సామర్థ్యంతో సంపులు నిర్మించారు. పట్టణంలో 120 కి.మీ. మేర పైప్‌లైన్‌ వేశారు. ఈక్రమంలో సమీప అవుసులపల్లి, ఔరంగాబాద్‌, పిల్లికొట్టాల గ్రామాలు పురపాలికలో విలీనమయ్యాయి. మొత్తం 11 వేలకు 9 వేల ఇళ్లకు మాత్రమే కుళాయిలు బిగించారు.

రెండు, మూడు బిందెలే..

పట్టణంలో ప్రధాన పైప్‌లైన్‌తో పాటు వీధుల్లో చిన్నపాటివి వేసి కుళాయిలు బిగించారు. 18వ వార్డు పరిధి మాలబస్తీలో పలు ఇళ్లకు నీళ్లు రావడం లేదు. వస్తున్న చోట సన్నటి ధార వస్తోంది. రెండు, మూడు బిందెలకు మించి రావడం లేదు. జలజాలం పైప్‌లైన్‌తో నీళ్లు రాకపోవడంతో పాత ట్యాంకుకు కనెక్షన్‌ ఇచ్చి పాత నల్లాల ద్వారానే సరఫరా చేస్తున్నారు.

* 18వ వార్డు పరిధి చర్చి కాంపౌండ్‌లోని సీఎస్‌ఐ ఆసుపత్రి వద్ద ఇళ్లకు దూరంగా పైప్‌లైన్‌ వేసి చేతులు దులుపేసుకున్నారు. చర్చి కాంపౌండ్‌ వెస్లీ పాఠశాల వెనుక ఉన్న గృహాలకు పైప్‌లైనే వేయలేదు.

* 22వ వార్డు ఫతేనగర్‌ బాలాజీమఠం వద్ద సన్నటి ధారే వస్తోంది. 25వ వార్డు పరిధి బుస్సగడ్డలో ఇదే పరిస్థితి.

* 5వ వార్డు పరిధి నాచం లక్ష్మీవరదయ్య కాలనీలో 50 ఇళ్లకు పైప్‌లైన్‌ వేసినా నిరుపయోగమే. రెండు బోరుమోటార్లు ఉండగా, వాటి ద్వారా ట్యాంకు నింపి సరఫరా చేస్తున్నారు.

* జిల్లా న్యాయస్థానాల సముదాయం వద్ద ప్రత్యేకంగా పైప్‌లైన్‌ వేసి వదిలేశారు. దాయరలోని మలుపు వద్ద పలు ఇళ్లకు కనెక్షన్లు కరవయ్యాయి. 31వ వార్డు పెద్దబజారులో ఇష్టానుసారంగా రహదారిని తవ్వడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అంతటా లీకేజీలు

జలజాలం పనులు ఇష్టారీతిగా చేపట్టడంతో తరచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. పట్టణంలో ప్రధాన రహదారిపై ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. స్థానిక ఎంజీ రోడ్డులో రెండు చోట్ల, పిల్లల ఉద్యానం వద్ద, కొత్తబస్టాండ్‌ సమీపంలో, ఫతేనగర్‌ చింతబొందకు వెళ్లే దారిలో ప్రధాన రహదారిపై తారును తవ్వి మరమ్మతులు చేశారు. ఎంజీరోడ్డులో పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. 22వ వార్డు ఫతేనగర్‌ బాలజీ మఠం సమీపంలో ఇదే పరిస్థితి. ఈ విషయమై మున్సిపల్‌ డీఈఈ మహేశ్‌ను వివరణ కోరగా.. పెద్దప్రాజెక్టు కావడంతో లీకేజీలు సాధారణమని, మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఆయా వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.


స్పందించని అధికారులు
- జయరాజు, 18వ వార్డు కౌన్సిలర్‌

వార్డులో జలజాలం పనులపై పలు మార్లు కౌన్సిల్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నాం. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. సన్నటిధారే వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. చర్చి కాంపౌండ్‌ ప్రాంతంలో నీళ్లు రావడం లేదు. గతంలోని ట్యాంక్‌లోకి నీటిని పంపింగ్‌ చేసి పాత కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని