logo

తొలి శక్తి పీఠం బగలాముఖి ప్రతిష్ఠోత్సవం

బగలాముఖి.. కాళికామాత శక్తి స్వరూపాల్లో ఒకరు. ఒకానొక సమయంలో సర్వ ప్రాణులకు ఉపద్రవం కలుగగా రక్షించమని మహావిష్ణువే స్వయంగా ఒక పసుపు వర్ణం పరాశక్తి కోసం ఘోరమైన తపస్సు ఆచరించగా బగలాముఖి అవతరించిందని ఒక పురాణ ఘట్టం.

Published : 08 Feb 2023 02:03 IST

నేటి నుంచి 10వ తేదీ వరకు ప్రత్యేకార్చనలు

అమ్మవారి బాలాలయం

బగలాముఖి.. కాళికామాత శక్తి స్వరూపాల్లో ఒకరు. ఒకానొక సమయంలో సర్వ ప్రాణులకు ఉపద్రవం కలుగగా రక్షించమని మహావిష్ణువే స్వయంగా ఒక పసుపు వర్ణం పరాశక్తి కోసం ఘోరమైన తపస్సు ఆచరించగా బగలాముఖి అవతరించిందని ఒక పురాణ ఘట్టం. దుష్టశక్తుల నుంచి అందరినీ రక్షించి సుఖసంతోషాలు ప్రసాదించే మాతగా బగలాముఖిని ఆరాధిస్తారు. అమ్మవారు మెదక్‌ జిల్లా శివ్వంపేటలో కొలువుదీరడం విశేషం. నేడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

తొలిసారిగా శక్తి పీఠం

రాష్ట్రంలోనే తొలిసారిగా శివ్వంపేటలో బగలాముఖి శక్తిపీఠాన్ని నిర్వాహకులు స్థాపించారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తయింది. బుధవారం నుంచి 10వ తేదీ వరకు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. బగలాముఖి, దక్షిణామూర్తి, వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యుడి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. గ్రామానికి చెందిన శాస్త్రుల విశ్వనాథశాస్త్రి విద్యాలయాన్ని నెలకొల్పి అనేక మందికి వేదాలు నేర్పించారు. ఆయన శిష్యులు పలు ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1980లో పబ్బ రామవ్వ, అంజయ్య గుప్తా దంపతులు వేదవిద్యాలయానికి స్థలాన్ని దానం చేశారు. శృంగేరి జగద్గురు భారతీ తీర్థస్వామి.. 1985లో శంకుస్థాపన చేశారు. ఆయన తదనంతరం పాఠశాల బాధ్యతను కుమారుడు రాష్ట్ర విద్యాశాఖలో డైరెక్టర్‌గా పని చేసిన శాస్త్రుల వేంకటేశ్వరశర్మ, తెలుగు పండిత్‌ ఉపాధ్యాయుడు శాస్త్రుల వామనశర్మ చేపట్టారు.

18 నెలల కాలం

వేదపాఠశాలకు చెందిన స్థలాన్ని మాజీ సర్పంచి పబ్బ రమేశ్‌గుప్తా, స్వరూప, జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేశ్‌గుప్తా, స్వాతి దంపతులు బగలాముఖి ఆలయ నిర్మాణానికి బహూకరించారు. రెండు దశాబ్దాలకు పైగా అమ్మవారిని వేంకటేశ్వరశర్మ ఉపాసిస్తున్నారు. 2021లో పదవీ విరమణ తర్వాత ఆ స్థలంలో శక్తిపీఠం నిర్మాణానికి సంకల్పించారు. 18 నెలల కాలంలోనే సాంఖ్యాయన తంత్ర శాస్త్రం ప్రకారం నిర్మించారు. 82 అడుగుల పొడవు, 36 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో అష్టభుజి ఆకారంలో నిర్మితమైంది. సుమారు ఎకరా భూమిలో పూర్తయింది. మహామండప ప్రాకారంపై 18 శక్తిపీఠాలు ఏర్పాటు చేశారు. క్షేత్రంలో గర్భాలయం చుట్టూ పసుపు నీళ్ల కందకాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఆళ్లగడ్డలో ఆరు అడుగుల తొమ్మిది ఇంచుల కృష్ణశిలతో విగ్రహాన్ని రూపొందించారు. ఆలయం త్వరగా నిర్మించి అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో బగలాముఖి శక్తిపీఠం ఛారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వెంకటేశ్వరశర్మ, గౌరవ సభ్యులుగా హైకోర్టు సీనియర్‌ న్యాయవాది జిన్నారం శివకుమార్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేశ్‌గుప్తా, వెంకటరమణశర్మ, పురుషోత్తంశర్మ, శివ్వంపేట సర్పంచి పత్రాల శ్రీనివాస్‌గౌడ్‌ కొనసాగుతున్నారు.

జగద్గురువు రాక

శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు జగద్గురువు శంకరాచార్య భారతీతీర్థ స్వామి, విధుశేఖరస్వామి, మదనానంద సరస్వతి, మాధవానంద సరస్వతిస్వామి ఆధ్వర్యంలో క్రతువులు జరుగనున్నాయి. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఆలయ పరిసరాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. రోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బగలాముఖి శక్తి పీఠాన్ని దాతల సహకారంతో పూర్తి చేశామని.. మూడు రోజుల పాటు జరిగే ప్రతిష్ఠోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని విజయవంతం చేయాలని పీఠం వ్యవస్థాపకుడు వేంకటేశ్వరశర్మ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని