logo

ఆడపిల్లలకు మేనమామలా కేసీఆర్‌

కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌, దిల్లీలో కూర్చొని మాట్లాడితే ఫలితం ఉండదని, లబ్ధిదారులతో మాట్లాడాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 10 Jun 2023 01:47 IST

సంక్షేమ సంబురాల్లో మంత్రి హరీశ్‌రావు

ప్రమాద బీమా చెక్కును లబ్ధిదారుకు ఇస్తున్న మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు

సిద్దిపేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ నేతలు గాంధీ భవన్‌, దిల్లీలో కూర్చొని మాట్లాడితే ఫలితం ఉండదని, లబ్ధిదారులతో మాట్లాడాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సిద్దిపేటలో సంక్షేమ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒక్కో ఇంట్లో ముగ్గురు నుంచి నలుగురికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పాలనలో 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 44 లక్షలకు చేరిందని వివరించారు. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో ఒక్కొక్కరికి రూ.700 దాటడం లేదన్నారు. ఆడపిల్లల మేనమామలా మారిన సీఎం కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ ద్వారా 12.71 లక్షల మంది వివాహాలకు కులం, మతం, పార్టీ, లంచాలకు తావులేకుండా రూ.11,130 కోట్లు ఇచ్చారన్నారు. నాడు చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమారెడ్డి సహా ఏ ప్రభుత్వాలూ ఆ దిశగా ఆలోచన చేయలేదన్నారు. ఈ నెల 14 నుంచి రాష్ట్రంలోని 6.80 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ మొదలెడతామన్నారు. సిద్దిపేట అభివృద్ధిపై ప్రస్తావించే సమయంలో.. దేశంలో కుక్కలు మనుషులను చంపవచ్చు కాని అదే మనుషులు కుక్కలను చంపితే తప్పుగా మారిందని, దీంతో వాటికి కు.ని. శస్త్ర చికిత్సలు చేయించాల్సిన పరిస్థితికి చేరామని మంత్రి వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, బల్దియా అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షుడు కనకరాజు, రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు పాలసాయిరాం, కొండం సంపత్‌రెడ్డి ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని