logo

ప్రత్యామ్నాయ సాగుపై ప్రణాళికలు అవసరం

పంటల సాగు సరళి మార్పుతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్‌ డా.రావుల ఉమారెడ్డి అన్నారు. ఇందుకు రైతులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Published : 10 Jun 2023 01:47 IST

వ్యవసాయ పరికరాలను పరిశీలిస్తున్న రైతులు

వరంగల్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: పంటల సాగు సరళి మార్పుతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్‌ డా.రావుల ఉమారెడ్డి అన్నారు. ఇందుకు రైతులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ అగ్రిటెక్‌ అసోచాయ్‌ సంస్థ ఆధ్వర్యంలో వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆధునిక వ్యవసాయం, సాంకేతిక సాగు విధానాలపై ప్రదర్శన, సదస్సు జరిగింది. ప్రదర్శనను శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి అసోచాయ్‌ కో కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ప్రారంభించారు. సదస్సులో డా.ఉమారెడ్డి ప్రసంగించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ సీజన్లను మార్చి 30లోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పంట కాలాన్ని ముందుకు తీసుకొచ్చేందుకు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. పత్తి విభాగ సీనియర్‌ శాస్త్రవేత్త డా.రాంప్రసాద్‌ మాట్లాడుతూ.. పత్తికి గులాబీ పురుగు బెడద ఇప్పటికీ ఉందన్నారు. అధిక సాంద్రత విధానంలో సాగు చేయడం మేలని సూచించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, అధికారులు సమాధానాలిచ్చారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్‌రాజు, సీనియర్‌ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శనలో 80 వరకు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వివిధ పంటల విత్తనాలు, ఆధునిక పరికరాలు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, కొత్త సాగు విధానంలో ఉపయోగించే ట్రాక్టర్లు, కొత్త వంగడాలు తదితరాలను ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని