logo

అంచెలంచెలుగా.. అత్యున్నతంగా..

శాసనసభ్యుడిగా ఎన్నికైన   వారెంతో మంది ఉన్నా  వాళ్లలో   కొంతమందినే మంత్రి, ఇతర  పదవులు వరించాయి. కొందరు తొలిసారి ఎన్నికవగానే దక్కగా, మరికొందరు వరుస విజయాలు సాధించడంతో పెద్ద పీట వేశారు. ఏదేమైనా పదవులను అలంకరించి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారు.

Updated : 29 Oct 2023 04:23 IST

పదవులతో అందలమెక్కిన వారెంతో మంది
న్యూస్‌టుడే, మెదక్‌

శాసనసభ్యుడిగా ఎన్నికైన   వారెంతో మంది ఉన్నా  వాళ్లలో   కొంతమందినే మంత్రి, ఇతర  పదవులు వరించాయి. కొందరు తొలిసారి ఎన్నికవగానే దక్కగా, మరికొందరు వరుస విజయాలు సాధించడంతో పెద్ద పీట వేశారు. ఏదేమైనా పదవులను అలంకరించి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చారు. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఉన్నత పదవులు దక్కించుకున్న వారిపై  ‘న్యూస్‌టుడే’ కథనం.


స్వరాష్ట్రాన్ని సాధించి.. సీఎంగా..

గజ్వేల్‌: భారాస అధినేత    కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచి రెండు సార్లు గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగి గెలుపొందారు. తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2018లో రెండోసారి కూడా విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మూడోసారి ఇక్కడి నుంచే బరిలో ఉన్నారు.


పేరొందిన మదన్‌మోహన్‌..

సిద్దిపేట: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే, మంత్రి.. దివంగత అనంతుల    మదన్‌మోహన్‌ది కొండపాక. న్యాయవాది అయిన ఈయన వాక్‌చాతుర్యం, ప్రతిభతో ఆకట్టుకున్నారు. తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్‌)కి వ్యవస్థాపక అధ్యక్షుడు. 1970లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. 1972, 1978, 1983లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు ఖాతాలో వేసుకున్నారు. అప్పట్లో రాష్ట్ర సాంకేతిక విద్య, వైద్యారోగ్య, వాణిజ్య, రెవెన్యూ తదితర శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


అందోలు నుంచి..

జోగిపేట: అందోలు నియోజకవర్గం నుంచి 1967, 72, 78 మూడు సార్లు ఎమ్మెల్యేగా సిలారపు రాజనరసింహ గెలుపొందారు. 1972లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు.

  • ఇక్కడి నుంచి విజయం సాధించిన మల్యాల రాజయ్య 1985లో ఆర్థిక, విద్యుత్తు రెండు శాఖలను నిర్వహించారు. 1994లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.
  • 1989, 2004, 2014లలో మూడు సార్లు సిలారపు దామోదర రాజనర్సింహ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా, 2014లో ఉన్నత విద్య, ఉప ముఖ్యమంత్రి పదవులు చేపట్టారు.
  • కార్మిక శాఖ మంత్రి పదవిని చేపట్టిన సినీ నటుడు బాబూమోహన్‌ 1998లో అందోలుకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ భారాస నుంచి గెలుపొంది రాష్ట్ర కార్మిక శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

పల్లె నుంచి స్పీకర్‌ వరకు

సంగారెడ్డి అర్బన్‌, కొండాపూర్‌: సంగారెడ్డి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పి.రామచంద్రారెడ్డి 1962లో బరిలోకి దిగి గెలిచారు. 1972లో ఇదే పార్టీ నుంచి, 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985, 1989లలో కాంగ్రెస్‌ తరఫున రంగంలోకి దిగి విజయాలు అందుకున్నారు. 1989లో శాసనసభ స్పీకర్‌గా పని చేశారు.


ముగ్గురికి మంత్రి యోగం

జహీరాబాద్‌: జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 ఎన్నికలు జరిగాయి. గుండెరావు, ఎం.బాగారెడ్డి, పి.నర్సింహరెడ్డి, సి.బాగన్న, మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, గీతారెడ్డి, కె.మాణిక్‌రావులు పోటీ చేసి గెలుపొందారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎం.బాగారెడ్డి 1978లో పంచాయతీరాజ్‌, నీటిపారుదల శాఖ, 1980లో భారీ పరిశ్రమలశాఖ, 1982లో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. ఫరీదుద్దీన్‌ 2004లో మైనార్టీ, మత్స్య, సహకార శాఖల మంత్రిగా ఉన్నారు. గీతారెడ్డి 2009లో పర్యాటక, సమాచార, భారీ పరిశ్రలశాఖ మంత్రిగా పని చేశారు.


కీలక నేతగా ఎదిగి..

హరీశ్‌రావు.. పరిచయం అక్కర్లేని నేత. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో భారాస (అప్పట్లో తెరాస) తరఫున పోటీ చేసి తొలి విజయం అందుకున్నారు. ఆ తరువాత 2008 ఉప, 2009 సాధారణ, 2010 ఉప, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో గెలుపొందారు. డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించి ఏడోసారి బరిలో దిగారు. ప్రస్తుతం వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తొలిగా యువజన, క్రీడల సర్వీసులు శాఖ మంత్రిగా, స్వరాష్ట్రంలో నీటి పారుదల, మార్కెటింగ్‌, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రిగా పని చేశారు.


రెండు పర్యాయాలు

గజ్వేల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు జె.గీతారెడ్డి గజ్వేల్‌ నుంచి గెలిచి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఇక్కడి నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎమ్మెల్యే ఈమెనే కావడం గమనార్హం. 1989లో సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు.


దొమ్మాటకు వరించి..

చేగుంట: దొమ్మాట నుంచి తెదేపా నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన చెరుకు ముత్యంరెడ్డికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో సీఎం చంద్రబాబునాయుడి హయాంలో మంత్రిగా పని చేశారు. 2009లో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.


ఏకంగా ముఖ్యమంత్రి

వికారాబాద్‌: వికారాబాద్‌ నియోజకవర్గం మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి పరిచయం అక్కర్లేని నాయకుడు. ఈయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1978, 1989లలో రాష్ట్రాన్ని పాలించారు. అనంతరం తమిళనాడు, రాజస్థాన్‌ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ పని చేశారు. పాలనలో తనదైన ముద్ర వేసి రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.


14 ఏళ్ల పాటు

తాండూరు: తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎం.మాణిక్‌రావు 1969లో జరిగిన తాండూరు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 1972, 78, 83లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. మర్రి చెన్నారెడ్డి, పీవీ నరసింహరావు, జలగం వెంగళరావు హయాంలో 14 ఏళ్ల పాటు మున్సిపల్‌, వాణిజ్య పన్నులు, సమాచార, రహదారులు, భవనాల శాఖల మంత్రిగా పని చేశారు.

మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు సోదరుడు ఎం.చంద్రశేఖర్‌రావు 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమం, అటవీశాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు.


పరిగి నుంచి గెలిచి..

పరిగి: ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన గండేడ్‌ మండలం మహమ్మదాబాద్‌ వాస్తవ్యుడు కమతం రామిరెడ్డిని 1967లో పౌరసరఫరాలు, 1991-92లో వ్యవసాయ మార్కెటింగ్‌, గిడ్డంగులు, 1994లో రెవెన్యూశాఖ మంత్రి పదవులు వరించాయి. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో రెండో సీఎంగా వెలుగొందారు.


తెదేపా నుంచి గెలిచి..

వికారాబాద్‌: 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి తెదేపా అభ్యర్థిగా విజయం సాధించిన డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ అప్పటి సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రిగా, మత్స్యశాఖ మంత్రిగా కొనసాగారు. 2004లో కాంగ్రెస్‌- తెరాస పొత్తులో భాగంగా తెరాస అభ్యర్థిగా గెలుపొంది వైఎస్సార్‌ హయాంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు.

తెలంగాణ ఏర్పాటుకు 2008లో తెరాస ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయగా.. చంద్రశేఖర్‌ పదవిని త్యజించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్‌ విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో చేనేత, లఘు పరిశ్రమలశాఖ మంత్రిగా పని చేశారు.


రవాణా శాఖ..

తాండూరు: 2018లో తాండూరు నుంచి భారాస తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు నెలల ముందు గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కేసీఆర్‌ మరోసారి అవకాశం కల్పించారు.


ముగ్గురి హయాంలో..

నర్సాపూర్‌: సునీతాలక్ష్మారెడ్డి 1999 సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఈమె భర్త శివ్వంపేట మాజీ జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మారెడ్డి హఠాన్మరణంతో తెరపైకి వచ్చారు. అప్పట్లో పోటీ చేసిన సునీతారెడ్డి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లోనూ విజయాలు అందుకున్నారు. 2009లో వైఎస్‌ఆర్‌ మంత్రి వర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. రోశయ్య మంత్రి వర్గంలోనూ కొనసాగారు. 2010-2014 వరకు కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, స్వయం సహాయక సంఘాలు, ఇందిరాక్రాంతి పథం, పింఛన్ల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.


నాలుగు సార్లు

మెదక్‌: మెదక్‌ నియోజకవర్గ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత స్వర్గీయ మంత్రి కరణం రాంచందర్‌రావుది. 1983లో ఎన్టీ రామరావు ప్రభుత్వ హయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా కొనసాగారు. 1985లో జరిగిన ఎన్నికల్లోనూ గెలుపొంది సహకార శాఖ మంత్రిగా ఉన్నారు. 1994లో తిరిగి తెదేపా ప్రభుత్వం రావడంతో మరోసారి పంచాయతీరాజ్‌ శాఖే దక్కింది. 1999లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన కన్నుమూశారు.


ఉప ముఖ్యమంత్రిగా..

నర్సాపూర్‌: పట్టణానికి చెందిన చౌటి జగన్నాథరావు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం విశేషం. ఈయన 8 సార్లు పోటీ చేయగా మూడు సార్లు గెలిచారు. 1980లో అంజయ్య మంత్రి వర్గంలో ఆబ్కారీ, 1982లో భవనం వెంకట్రాంరెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.


అనూహ్యంగా వచ్చి..

1978 అనంతరం చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్‌కు చెందిన టి.అంజయ్యను సీఎంను చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఆ సమయంలో రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న ముత్యంరెడ్డి రాజీనామా చేసి ఆ స్థానాన్ని అంజయ్యకు ఇచ్చారు. ఆ సమయంలో ఎన్నిక ఏకగ్రీవం కాగా, ఎమ్మెల్యే అయి అంజయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. 16 నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు. 1983లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా అత్యధిక స్థానాల్లో గెలవగా, రామాయంపేటలో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించడం గమనార్హం.


తొలి ఉపసభాపతిగా..

2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రం ఆవతరించగా, తెరాస (భారాస) ప్రభుత్వం ఏర్పడింది. మెదక్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మాదేవేందర్‌రెడ్డికి ఉపసభాపతిగా అవకాశం కల్పించారు. నాలుగేళ్ల పాటు కొనసాగారు. అసెంబ్లీ సమావేశాలను ఆమె సమర్థవంతంగా నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని