logo

సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా..

సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్‌ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్‌ పొందడం గమనార్హం.

Updated : 28 Mar 2024 04:43 IST

నీలం మధు

న్యూస్‌టుడే, మెదక్‌: సేవా కార్యక్రమాల నిర్వహణతో రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకుంటున్న ఆయనను ఎంపీ టికెట్‌ వరించింది. ఏకంగా జాతీయ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కలిగింది. కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజులకే ఎంపీ టికెట్‌ పొందడం గమనార్హం. ఇతర లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయా సామాజిక వర్గాల వారికి అవకాశం ఇచ్చిన హస్తం పార్టీ, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గానికి వచ్చే సరికి బీసీకి చెందిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదటి నుంచి రేసులో ఉన్న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నీలం మధు అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపింది. భారాసతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్‌చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో అప్పట్లో కాంగ్రెస్‌, భాజపాలో చేరుతారని ప్రచారం జరిగినా, బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లో చేరి పటాన్‌చెరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అనంతరం లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఎంపీగా పోటీచేసి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న ఆయన కొద్దిరోజుల కిందట కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు.

యోధులను కాదని...: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు పదవులను ఆశిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఎంపీగా పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూశారు. బరిలో నిలవాలని భావిస్తున్న వారు అర్జీ చేసుకోవాలని టీపీసీసీ సూచించడంతో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించగా, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి పేర్లు సైతం వినిపించాయి. పోటీ చేసేందుకు మైనంపల్లి విముఖత వ్యక్తం చేయడం, ఇటీవల నిర్మలారెడ్డికి కార్పొరేషన్‌ పదవి అప్పగించడంతో వారిద్దరి పేర్లను పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు పటాన్‌చెరుకు చెందిన నీలం మధుతో పాటు 2009 కాంగ్రెస్‌, 2014లో భాజపా తరఫున ఎంపీగా పోటీచేసిన నరేంద్రనాథ్‌ పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఆశావహుల బలాబలాలపై రాష్ట్ర పార్టీ సర్వే చేయించింది. ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించిన అనంతరం కాంగ్రెస్‌ రాష్ట్ర ముఖ్య నేతలు మధు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. దీంతో అతని పేరును కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ(సీఈసీ)కి సిఫార్సు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి దిల్లీలో జరిగిన సమావేశంలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఖరారు చేశారు.

ఉద్యమంలో పాల్గొని

పటాన్‌చెరు మండలం చిట్కుల్‌కు చెందిన నీలం మధు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నారు. భారాసలో కొనసాగిన ఆయన 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డుసభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత 2014లో ఉపసర్పంచిగా ఎన్నికయ్యారు. 2014 ప్రాదేశిక ఎన్నికల్లో భారాస(నాటి తెరాస) తరఫున జడ్పీటీసీగా పోటీ చేశారు. అనంతరం 2019లో సర్పంచి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్‌ఎంఆర్‌ యువసేన స్థాపించి గత కొన్నేళ్లుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

వ్యక్తిగత వివరాలు

పేరు: నీలం మధు
వయసు: 41
స్వస్థలం: చిట్కుల్‌, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా.
తల్లిదండ్రులు: నీలం నిర్మల్‌, రాధ.
విద్యార్హత: పదో తరగతి
కుటుంబం : భార్య కవిత, ఇద్దరు సంతానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని