logo

‘ఉపాధి’ పని.. లక్ష్యానికి హామీ

వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

Published : 29 Mar 2024 03:37 IST

రోజూ 40 వేల మందికి పైగా కూలీల హాజరు

హుస్నాబాద్‌ మండలం మడదలో కూలీలు

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం, గజ్వేల్‌ గ్రామీణం: వ్యవసాయ కార్యకలాపాలు ప్రస్తుతం సన్నగిల్లడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రామీణాభివృద్ధి జిల్లా అధికారులు కూలీల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా కూలీల సంఖ్య గత ఏడాదితో పోల్చితే గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో మొక్కజొన్న పంట కోత దశలో ఉండగా వరి గొలుసు వేసే దశలో ఉంది. కూలీలంతా ఉపాధి హామీ పనులపై దృష్టి సారించారు. కూలీలకు డబ్బుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. గత మూడు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఎండ తీవ్రతతో కూలీలు ముందుకు రాకపోవడంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్‌ ఆర్య ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.

గ్రామానికో అధికారి కేటాయింపు

అధికారులు తక్కువ హాజరు ఉన్న మండలాలపై దృష్టి సారించారు. ప్రతి గ్రామంలో కనీసం 75 నుంచి 100 మందిని పనికి రప్పించాలని నిర్ణయించారు. ఆయన స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఆరా తీశారు. ఏపీడీలు, ఇతర అధికారులను గ్రామానికి ఒకరి చొప్పున కేటాయించారు. డబ్బులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కూలీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

వంద రోజులు పూర్తి

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 40 వేలకు పైగా కూలీలు హాజరవుతున్నారు. ఈ నెల 22న 40,586 మంది కూలీలు హాజరయ్యారు. మార్చి నెలలో గతంలో ఎప్పుడూ ఇంత పెద్దసంఖ్యలో రాలేదు. సాధారణంగా మే నెలలో సంఖ్య 40 వేలు దాటుతుంది. చాలా మంది కూలీల జాబ్‌కార్డులు వంద రోజులు పూర్తి కావడంతో పనికి రావడం లేదు. బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి అనేకచోట్ల పంట పొలాలు ఎండిపోయాయి. వ్యవసాయ పనులు లేక రైతులు ఉపాధి పనులకు వస్తున్నారు.


చేపడుతున్న పనులు

  • భూముల అభివృద్ధి
  • చెట్లు తొలగించి చదును
  • పొలాలకు వెళ్లేందుకు మట్టి దారుల నిర్మాణం
  • చేపల చెరువుల తవ్వకం
  • ఫీడర్‌ ఛానల్‌ కాలువ
  • నీటివనరుల్లో పూడిక తీయడం
  • మట్టితో చెరువు, కుంట కట్టల బలోపేతం

2,000 మందికి పైగా కూలీలు హాజరవుతున్న మండలాలు: అక్కన్నపేట, కొండపాక, దుబ్బాక, జగదేవపూర్‌, గజ్వేల్‌, కోహెడ, నంగునూరు, చిన్నకోడూరు


1,000 మందికి పైగా హాజరు: మద్దూరు, వర్గల్‌, దౌల్తాబాద్‌, మిరుదొడ్డి, బెజ్జంకి, చేర్యాల, ములుగు, సిద్దిపేట గ్రామీణ, రాయపోల్‌, మర్కూక్‌, తొగుట, హుస్నాబాద్‌


1,000 మంది కంటే తక్కువ హాజరు: సిద్దిపేట అర్బన్‌, కొమురవెల్లి, నారాయణరావుపేట


అక్కన్నపేట మండలంలో అత్యధికంగా 2,637 మంది కూలీలతో మొదటి స్థానం... 804 మందితో నారాయణరావుపేట చివరి స్థానంలో ఉన్నాయి.


జాబ్‌ కార్డులు: 2,01,567
క్రియాశీలం: 1,35,564


ఏప్రిల్‌లో పెరిగిన వేతనం అమలు

ఉపాధి కూలీలకు కేంద్రం తీపి కబురు అందించింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త కూలీ అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినపుడు కూలీ రూ.87.50గా ఉండేది. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తారు. ఉపాధి కూలీలకు గతంలో వేసవి భత్యం ఇచ్చేవారు. మార్చి నుంచి జూన్‌ వరకు 15 నుంచి 30 శాతం అందించేవారు. రెండేళ్ల నుంచి భత్యం అందడం లేదు. దాని స్థానంలో ఏటా ఏప్రిల్‌లో కొంత మొత్తం కూలీని పెంచుతున్నారు. 2022లో రూ.12, 2023లో రూ.15 పెంచారు. ఈ ఏడాది రూ.28 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పనుల ప్రదేశంలో గుడారం, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ పొట్లాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని