logo

ప్రచారం.. ఇక ముమ్మరం

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్‌, భాజపా భావిస్తున్నాయి.

Updated : 19 Apr 2024 01:36 IST

క్షేత్రస్థాయిలోకి పార్టీల అభ్యర్థులు, అధినేతలు

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. నామినేషన్ల దాఖలు కార్యక్రమం మొదలు కావడంతో క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భారాస, కాంగ్రెస్‌, భాజపా భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తూ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ నేతల ప్రచారంతో నియోజకవర్గంలో పాగా వేయాలని భాజపా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. మరోవైపు భారాస అధినేత కేసీఆర్‌ నియోజకవర్గంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌.


కేసీఆర్‌ బస్సు యాత్రకు సన్నాహాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కార్యకర్తలను సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేసే ఉద్దేశంతో భారాస ఇప్పటికే నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భవన్‌లో గురువారం భారాస అధినేత కేసీఆర్‌ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించినట్లు సమాచారం. బస్సుయాత్ర మెదక్‌ నియోజకవర్గంలో పూర్తయిన తర్వాత జహీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా వెళ్లేలా ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని నేతలకు సూచించినట్లు సమాచారం.


జాతీయ నాయకులతో ప్రచారం చేయనున్న భాజపా

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న భాజపా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ జాతీయ నేతలను ప్రచారానికి ఆహ్వానించి సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను నామినేషన్‌ కార్యక్రమానికి రప్పిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులను ఆహ్వానించి భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇంటింటి ప్రచారం నిర్వహించేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.


సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

జహీరాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి, జుక్కల్‌, అందోలు, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. కామారెడ్డి, బాన్సువాడ, జహీరాబాద్‌లో పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థి విజయావకాశాలపై అంచనాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 24న జహీరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభ లేదా రోడ్‌షో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పీసీసీ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రచారం ముగిసేలోపు ఎల్లారెడ్డి, బాన్సువాడ, అందోలు, కామారెడ్డిలలో సీఎం సభలు నిర్వహించేందుకు పార్టీ అభ్యర్థి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని