logo

కార్మికుల రాత మార్చే నేత కావాలి

చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

Updated : 01 May 2024 05:50 IST

నేడు మేడే

చేగుంట మండలం రెడ్డిపల్లిలోని ఓ పరిశ్రమకు చెందిన 15 మంది కార్మికులను శిథిలావస్థకు చేరిన గదిలో నివాసం ఉంచారు. గతేడాది ఆగస్టులో భారీ వర్షానికి గోడలు కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందగా, ఐదుగురికి పైగా తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వారంతా దూరం ప్రాంతం నుంచి వచ్చినవారే.

హత్నూర మండలం గుండ్లమాచునూర్‌ శివారులోని ఓ పరిశ్రమలో ఇటీవల రియాక్టర్‌ పేలి ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ విషాదం మరువకముందే చందాపూర్‌లోని మరో పరిశ్రమలో గత నెలలో రియాక్టర్లు పేలి ఆరు మంది మృతి చెందారు. నెల రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడంతో కార్మికుల్లో ప్రాణ భయం నెలకొంది.

 న్యూస్‌టుడే, జిన్నారం, సిద్దిపేట, చేగుంట, తాండూరు, హత్నూర, మనోహరాబాద్‌: పరిశ్రమలు.. అభివృద్ధికి సూచికలు. వాటిల్లో పని చేసే శ్రామికులు మాత్రం అష్టకష్టాలు పడుతుంటారు. భవన నిర్మాణాలు, బీడీ, ఇతర రంగాల్లోనూ కార్మికులు వేలాది మంది పని చేస్తూ బతుకు వెళ్లదీస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఎంతోమంది పరిశ్రమల్లో అవస్థల మధ్య పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ సారైనా ఎంపీగా ఎన్నికయ్యే నేతలు తమ సమస్యలు పరిష్కరించి మా జీవితాలను చక్కదిద్దుతారని ఆశగా ఎదురుచూస్తున్నారు. నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా వారి వెతల తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 30 వరకు పారిశ్రామిక వాడలున్నాయి. వాటిల్లో లక్షలాది మంది పని చేస్తున్నారు. వీరిలో 3.75 లక్షల మంది ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నారు. మిగతావారంతా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో లక్ష మంది వరకు స్వగ్రామాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీళ్లూ హక్కు వినియోగానికి వెళ్లేందుకు ప్రయాణానికి బుకింగ్‌ చేసుకొని సిద్ధమయ్యారు.

రక్షణ చర్యలు కరవు..

పరిశ్రమల్లో రక్షణ చర్యలు కరవయ్యాయి. ప్రధానంగా రసాయన పరిశ్రమల్లో భద్రత చర్యలు శూన్యం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల హత్నూర, జిన్నారంలో జరిగిన ఘటనలే నిదర్శనం. ఇక పరిహారం విషయంలో స్పష్టత లేదు. భారీ పరిశ్రమలకు చెందిన వారికే బీమా సదుపాయం ఉంది. అసంఘటిత కార్మికులకు దాని గురించే తెలియదు. భవనాల నిర్మాణాల సమయంలో మేస్త్రీలు, కార్మికులు పడిపోయి చనిపోతున్నారు. కార్మికుల పరిహారంపై చట్టం తీసుకొచ్చేలా శ్రమిస్తామని హామీ ఇవ్వాలని కార్మికులు విన్నవిస్తున్నారు.

నెరవేరని హామీలు..

ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్‌ కార్డులు, కనీస వేతన చట్టం అమలు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సదుపాయం, మౌలిక వసతులు, మహిళలకు రక్షణ వంటి ఎన్నో డిమాండ్లు ఉన్నాయి. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లోని పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామన్న హామీ అలాగే ఉండిపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా గెలిచే నేత ఆయా సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

వైద్య సేవలు అందక..

ఏదైనా పరిశ్రమ, సంస్థలో 20 మందికి మించి పని చేస్తే ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలి. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారానికి చెందిన డిస్పెన్సరీ మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కొనసాగుతోంది. గడ్డపోతారం, ఖాజీపల్లిలో ఉండే కార్మికులకు మేడ్చల్‌ జిల్లా షాపూర్‌నగర్‌కు వెళ్తున్నారు. సిద్దిపేటకు 2015లో డిస్పెన్సరీ మంజూరైనా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఔషధాలు, శస్త్రచికిత్సలకు హైదరాబాద్‌కు రిఫర్‌ చేస్తున్నారు. కాళ్లకల్‌, హత్నూరలోనూ వైద్య సేవలు అందడం లేదు. నాపరాళ్ల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తాండూరులోనే 20 వేల మందికిపైగా పని చేస్తున్నారు. ఇక్కడా ఈఎస్‌ఐ ఆసుపత్రి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని