logo

ఫలితం అద్వితీయం..స్థానం పదిలం

పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు.

Updated : 01 May 2024 01:54 IST

సిద్దిపేటలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంతోషం వ్యక్తం చేస్తున్న పదో తరగతి విద్యార్థులు

 న్యూస్‌టుడే, సిద్దిపేట: పదో తరగతి వార్షిక ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలిచి హవా కొనసాగించింది. గత విద్యా సంవత్సర స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ప్రత్యేకత నిలిపింది. 98.65 శాతం విద్యార్థులు పాసయ్యారు. మెరుగైన స్థానం సాధించడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 0.4 శాతం వ్యత్యాసంతో ప్రథమ స్థానాన్ని అందుకోలేకపోయినా.. తెలంగాణలో టాప్‌-2గా జిల్లా జయకేతనం ఎగురవేసింది. మరోవైపు మెరుగైన ఫలితాల జాబితాలో జడ్పీ పాఠశాలలు ముందంజలో నిలిచాయి.

బాలికలదే పైచేయి.. : జడ్పీ, ఉన్నత పాఠశాలలు - 222, ఆశ్రమ, వివిధ రకాల గురుకులాలు - 35, కేజీబీవీలు - 22, ఆదర్శ - 14, ఎయిడెడ్‌ - 1, ప్రైవేటు - 77 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 6,946 మంది బాలికలు పరీక్ష రాయగా 6,868 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ లెక్కన 98.88 శాతం పాసయ్యారు. బాలురు.. 7030 మంది పరీక్ష రాయగా 6920 మంది ముందడుగు వేశారు. ఉత్తీర్ణత శాతం - 98.44గా నమోదైంది
153 మందికి పదికి ‘పది’ జీపీఏ: ప్రైవేటు పాఠశాలలు మినహాయిస్తే.. మొత్తం 153 మందికి పదికి పది గ్రేడ్‌ వచ్చింది. అత్యధికంగా నంగునూరు మండలం నుంచి 23 మంది ఉన్నారు. జడ్పీ పాఠశాలల్లో పదికి పది జీపీఏ వచ్చినవారు 65 మంది, గురుకులాలు - 53, కేజీబీవీ - 10, ఆదర్శ - 25 మంది సాధించారు. గత ఏడాది 126 మంది సాధించారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 216 మంది 10/10 పొందారు. 2021-22లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

డిజిటల్‌ కంటెంట్‌తో ప్రోత్సాహం: పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి హరీశ్‌రావు డిజిటల్‌ కంటెంట్‌ను అందించి ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులతో టెలీ కాన్ఫరెన్సు పలుసార్లు నిర్వహించారు. ఉత్తరాల ద్వారా చైతన్య పరిచారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 40 రోజుల పాటు ప్రత్యేకంగా అల్పాహారం అందించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. పర్యవేక్షించిన కలెక్టర్‌, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. మరోసారి సిద్దిపేట గౌరవాన్ని చాటారంటూ అభినందించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఆత్మీయంగా మాట్లాడారు. పిల్లలను వైద్యున్ని చేస్తారా.. ఇంజినీరును చేస్తారా అని ఆరా తీశారు.


ముందు నుంచి ప్రణాళికతో..: శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

సిద్దిపేట ప్రతిష్ఠను నిలబెడుతూ.. గత స్థానాన్ని పదిలపర్చుకున్నాం. ప్రణాళికను అమలు చేశాం. ప్రత్యేక తరగతులు చక్కటి ఫలితాల సాధనకు దోహదం చేశాయి. పునశ్చరణ తరగతుల ద్వారా మరింతగా మెరుగుపర్చాం. జిల్లా పరీక్షల సహాయ సంచాలకుడు లక్ష్మయ్య, అధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి, తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని