logo

శాతం పెరిగె.. స్థానం దిగజారె!

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది.

Updated : 01 May 2024 05:56 IST

పది ఫలితాల్లో జిల్లాలో 92.90శాతం ఉత్తీర్ణత

13 నుంచి 18వ స్థానానికి పడిపోయిన మెతుకుసీమ  

 

మెదక్‌, న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మెతుకుసీమ విద్యార్థులు సత్తాచాటారు. ఈసారి ఫలితాల్లో కాస్త మెరుగుపడగా.. రాష్ట్ర స్థాయిలో స్థానం దిగజారింది. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జిల్లా 18వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 225 పాఠశాలలకు గాను 86 పాఠశాలలే శతశాతం ఫలితాలు సాధించడం గమనార్హం. ఇందులో అత్యధికంగా జిల్లా పరిషత్తు పాఠశాలలు ఉండడం విశేషం. మరోవైపు పది జీపీఏ సాధించడంలో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా వెనకబడ్డాయి. కేవలం ముగ్గురు మాత్రమే పది జీపీఏ సాధించారు. ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు అత్యధిక శాతంతో ఉత్తీర్ణులయ్యారు.

 బాలికలదే పై చేయి.. : జిల్లా ఆవిర్భావం నుంచి రాష్ట్ర స్థాయిలో పది లోపు ర్యాంకు సాధించిన మెతుకుసీమ.. గత రెండేళ్ల నుంచి వెనకబడుతోంది. 2021-22 విద్యాసంవత్సరంలో 11, 2022-23లో 13వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈసారి 18వ స్థానానికి చేరింది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన 225 ఉన్నత పాఠశాలల నుంచి మొత్తం 10,283 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. అందులో 9,553(92.90శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు మొత్తం 5,068 మంది పరీక్ష రాయగా 4,608 మంది(90.92శాతం), బాలికలు 5,215 మందికి 4,945 మంది(94.82శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఫలితాల సాధనలో బాలికలు ముందున్నారు. ప్రైవేట్‌ పాఠశాలలు 99.18శాతం ఫలితాలు సాధిస్తే, ప్రభుత్వానికి చెందిన ఆయా మేనేజ్‌మెంట్‌ పాఠశాలలు కలిపి 91.86 శాతం ఫలితాలు సాధించారు.
పెరిగిన ఫలితాల శాతం...: ఫలితాల్లో జిల్లా 18వ స్థానంలో నిలిచినప్పటికీ.. శాతం పరంగా కాస్త పెరిగింది. 2022-23 విద్యాసంవత్సరంలో 90.84శాతం ఫలితాలు రాగా, ఈసారి 92.90 శాతం వచ్చాయి. గతేడాదితో పోలిస్తే 2.06శాతం పెరిగింది. ఈసారి కూడా పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించారు. ప్రత్యేక తరగతుల సందర్భంగా విద్యార్థులకు అల్పాహారం సైతం అందించారు.
84మందికి పది జీపీఏ: జిల్లాలో 9,553 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైతే కేవలం 84 మంది మాత్రమే పది జీపీఏ సాధించారు. ఇందులో ప్రైవేటు పాఠశాలలకు చెందిన వారు 67 మంది కాగా, మిగిలిన 17 మంది ప్రభుత్వ బడులకు చెందిన విద్యార్థులు ఉన్నారు. గతేడాది 67 మంది పది జీపీఏ సాధిస్తే.. ఈసారి కాస్త పెరిగారు. బీసీ సంక్షేమంలో ఆరుగురు, ఆదర్శ పాఠశాలలో ముగ్గురు, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నలుగురు, గిరిజన పాఠశాలలో ఒకరు, జిల్లా పరిషత్తు పాఠశాలలో ముగ్గురు పది జీపీఏ సాధించారు.


ముందు నుంచే సన్నద్ధం చేశాం: రాధాకిషన్‌, డీఈవో

పదిలో ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాం. గత విద్యాసంవత్సరం కంటే  2.06 శాతం ఎక్కువ ఫలితాలు సాధించి.. ర్యాంకుపరంగా 18వ స్థానంలో జిల్లా నిలిచింది. పరీక్షలకు 4 నెలల ముందు నుంచి విద్యార్థులను సన్నద్ధం చేశాం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని