logo

బడుల బాగుకు నిధులు

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 30 Apr 2024 04:06 IST

జిల్లాకు రూ.20.62 కోట్లు మంజూరు 

చేగుంట మండలం కరీంనగర్‌ జడ్పీ ఉన్నత పాఠశాల

న్యూస్‌టుడే, చేగుంట: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. జిల్లాలో చాలా పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిధులు లేకపోవడంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నారు. ‘మన ఊరు..మన బడి’ కింద గతంలో చాలా పాఠశాలలను ఎంపిక చేశారు. కానీ చాలా చోట్ల పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసింది. వాటిద్వారా ఎంపిక చేసిన పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు.

చేపట్టే పనులు: ముఖ్యంగా శౌచాలయాలు, తాగునీరు, విద్యుత్తు, తరగతి గదుల మరమ్మతులు చేపట్టనున్నారు. మొదటి విడతగా మౌలిక వసతుల కల్పన, ఏకరూప దుస్తుల కుట్టుకూలీ కోసం 25శాతం నిధులు మంజూరు చేశారు. పాఠశాలల్లో గరిష్ఠంగా రూ.14 లక్షలు, కనిష్ఠంగా రూ.1.35 లక్షలతో పనులు గుర్తించారు. వీటిని అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల తీర్మానం మేరకు పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ అధికారులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి పనులు అవసరమో పరిశీలించారు.

నిబంధనల మేరకే నిధులు డ్రా

వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి మౌలిక వసతుల పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో బ్యాంకు ఖాతాలు తెరిపించారు. రూ.25 వేల విలువైన పనులు చేపట్టిన అనంతరం అమ్మ ఆదర్శ కమిటీలు సమావేశమై నిధులను బ్యాంకు నుంచి డ్రా చేయాల్సి ఉంటుంది. రూ.లక్ష వరకు అయితే ఎంపీడీవో అనుమతి తీసుకోవాలి. రూ.లక్ష పైబడి విలువైన పనులను చేపడితే జిల్లా మహిళా సమాఖ్యతో పాటు, ఉన్నతాధికారి అనుమతితో నిధులు డ్రా చేయాల్సి ఉంటుంది.

మొదటి విడతలో రూ.5 కోట్లు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20.62 కోట్లను మంజూరు చేసింది. మొదటి విడతగా 25శాతం కింద రూ.5 కోట్లు విడుదల చేశారు. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. జిల్లాలో మన ఊరు..మన బడి కింద మొదటి విడతలో 313 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో కొన్ని పనులు చేపట్టారు. పాఠశాలల భవనాలు, భోజనశాలలు వంటివి నిర్మాణం చేపట్టకుండా అసంపూర్తిగా వదిలేశారు. తర్వాత మౌలిక వసతులు లేని 562 పాఠశాలలను గుర్తించి పనులు చేపట్టనున్నారు.

పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి: రాధాకిషన్‌, డీఈవో

పాఠశాలల్లో అవసరమైన పనులను చేపట్టి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తిచేయాల్సి ఉంది. త్వరలోనే జిల్లాలో అన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తయితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని