logo

రాజ్యాంగ పరిరక్షణకే కాంగ్రెస్‌కు మద్దతు

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్‌లో ఆయన మాట్లాడారు.

Updated : 02 May 2024 06:32 IST

ఆచార్య కోదండరాం

మాట్లాడుతున్న కోదండరాం

మెదక్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం మెదక్‌లో ఆయన మాట్లాడారు. పదేళ్ల భాజపా పాలనలో అసమానతలు తీవ్రమయ్యాయని, 160 మంది బిలియనీయర్లు 25 శాతం ఆదాయాన్ని, 45 శాతం సంపదను అనుభవిస్తుంటే....దేశంలో 70 కోట్ల మంది పేదప్రజలు 6.5 శాతం ఆదాయాన్ని, 15 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారని, ఇంత తీవ్రమైన అసమానతలు ఇప్పటి వరకు లేవని ఆయన పేర్కొన్నారు. రైతుల రుణమాఫీకి రూ.5లక్షల కోట్ల డబ్బులు లేవన్న కేంద్రం రూ.30 లక్షల కోట్లను కార్పొరేట్‌ రంగాలకు మాఫీ చేసిందని దుయ్యబట్టారు. నిరుద్యోగం 2 శాతం నుంచి 8కి పెరిగిందని, వ్యవసాయ బడ్జెట్‌ 30 శాతం, రాయితీకి 40 శాతం తగ్గించిందన్నారు. మరోవైపు రాజ్యాంగంలో సంస్కరణలు, సవరణలు చేస్తామని చెప్పి, ఈ ఎన్నికల్లో మెజార్టీ ఇవ్వమని భాజపా అడుగుతోందని, అసమానతలను మరింత పెంచేందుకే కేంద్రంలో అధికారం కోరుకుంటోందని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా, న్యాయాన్ని సాధించేందుకు కాంగ్రెస్‌ ముందుకు రావడంతో, హస్తం పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరుతున్నామన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజా ఐకాస కో-కన్వీనర్‌ కన్నెకంటి రవి మాట్లాడుతూ స్వామినాథన్‌ సిఫారసు ప్రకారం మద్దతు ధర చెల్లిస్తామని భాజపా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని, పదేళ్లు అధికారంలో ఉన్నా, అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారని, వీరికి ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజుల పనిదినాలు కల్పించడం లేదన్నారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, మెదక్‌ సిటిజన్స్‌ ఫోరం బాధ్యులు పీడీ ఆనందం, దయాసాగర్‌, నర్సింహులు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు