logo

రూ.50 వేల కోట్లు ఎవరెత్తుకెళ్లారు: కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రూ.50 వేల కోట్లు మిషన్‌ భగీరథ పథకానికి ఖర్చు చేశామని, రాష్ట్రంలో 98 శాతం శుద్ధినీరు తాగిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారని.. కానీ, క్షేత్రస్థాయిలో పూర్తిగా నీరందడం లేదని,  మరి ఆ డబ్బు

Published : 26 Jan 2022 04:17 IST

వడపర్తి గ్రామసభలో మాట్లాడుతున్న ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో రూ.50 వేల కోట్లు మిషన్‌ భగీరథ పథకానికి ఖర్చు చేశామని, రాష్ట్రంలో 98 శాతం శుద్ధినీరు తాగిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నారని.. కానీ, క్షేత్రస్థాయిలో పూర్తిగా నీరందడం లేదని,  మరి ఆ డబ్బు ఏమైందని, ఎవరెత్తుకెళ్లారని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుతాన్ని ప్రశ్నించారు. భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గోదావరి జలాలు తాగడం లేదని సంబంధిత అధికారి సాక్షిగా ప్రజలు చెబుతున్నారని, ఈ గ్రామంలో 40 శాతం మేర నీటిని అందిస్తున్నారని, పాతపైపుల ద్వారా ఆ నీరు కలుషితమవుతోందని, కొత్త పైపులు ఏర్పాటు చేయలేదని తెలిపారు. సంసద్‌ ఆదర్శ గ్రామ యోజనలో భాగంగా వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకొన్న ఆయన ఆ పల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని స్థానిక సమస్యలు తెలుసుకొన్నారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర హోంమంత్రిగా, పంచాయతీ మంత్రిగా గొప్ప పేరు సంపాదించిన దివంగత మంత్రి మాధవరెడ్డి సొంత గ్రామమైన వడపర్తిలోనే మంచినీరు, ఇతర సమస్యలు తిష్ఠ వేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీని రద్దు చేసి కరోనా పరిస్థితిలో ఆరోగ్య సమస్యలు వస్తే సామాన్యుడికి లక్షల రూపాయల భారాన్ని మోపిందన్నారు.
ఏడాదిలోపు ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దుతా..
ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ఆనందంగా ఉందని.. ఇక్కడి సమస్యలన్నింటినీ పరిష్కరించి ఏడాదిలోగా ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దుతాన’ని అన్నారు. గ్రామంలో విద్యుత్తు, మంచినీరు, పాఠశాలకు ప్రహరీ, పేదలకు సొంత ఇళ్లు, తదితర పలు సమస్యలను ప్రజలు ఎంపీకి ఏకరవు పెట్టారు. మిషన్‌ భగీరథ నీరు ఇంటింటికి సరఫరా కావడం లేదని గ్రామస్థులు తెలపడంతో ఏఈని పిలిచి ఆరా తీశారు. ’మళ్లీ నెలలో ఇక్కడ గ్రామసభ ఏర్పాటు చేస్తా.. అప్పటి వరకు 98 శాతం ఇళ్లకు స్వచ్ఛమైన గోదావరి జలాలు అందక పోతే మీ స్థానంలో మరొకరుంటార’ని హెచ్చరించారు. ఇంతలోనే గ్రామస్థుడు మల్లయ్య వేదిక వద్దకి వచ్చి భగీరథ నీరు ఎవరు తాగుతున్నారని ప్రశ్నించడంతో ఎంపీ సముదాయించారు. వారంలో పాఠశాల ప్రహరీ నిర్మాణం ప్రారంభిస్తామని, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అధికారుల పనితీరుపై సమీక్ష జరుపుతానని, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి కోరారు. డీఆర్డీవో మందడి ఉపేందర్‌రెడ్డి, సహాయ డీఆర్డీవో నాగిరెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ సభ్యుడు సుబ్బూరు బీరుమల్లయ్య, సర్పంచి ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు ఉడుత శారద, ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, అధికారులు, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, తంగళ్లపల్లి రవికుమార్‌, రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని