logo

సూర్యాపేటలో జిల్లా కోర్టులు

సూర్యాపేట కేంద్రంగా జిల్లా కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 33 రెవెన్యూ జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయినా ఇప్పటివరకు

Published : 20 May 2022 02:51 IST

జూన్‌ 2న ప్రారంభానికి ఏర్పాట్లు

సూర్యాపేట కోర్టు భవనాలు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: సూర్యాపేట కేంద్రంగా జిల్లా కోర్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 33 రెవెన్యూ జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయినా ఇప్పటివరకు న్యాయశాఖలో పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే జిల్లా కోర్టులు కొనసాగుతున్నాయి. కొత్త వాటిలో సైతం జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు సుదీర్ఘ కసరత్తు నిర్వహించింది. భవనాలు, ఇతర సౌకర్యాల కల్పన అనంతరం కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. తెలంగాణ ఆవిర్భావ దినం జూన్‌ 2న రాష్ట్రంలోని 23 కొత్త జిల్లా కేంద్రాల్లో కోర్టుల ఏర్పాటుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తులను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన ఆదేశించారు.

ఇప్పటివరకు నల్గొండ కేంద్రంగానే.. జిల్లాల పునర్విభజన సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. అనంతరం జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. అయినా న్యాయశాఖలో విభజన జరగకపోవడంతో ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాగానే కొనసాగుతోంది. సూర్యాపేటలో 2004లో అదనపు జిల్లా న్యాయస్థానం, 2021లో పొక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఎన్‌డీపీఎస్‌ చట్టం, మహిళలపై అత్యాచారాలు వంటి నేరాలను విచారించే ప్రత్యేక కోర్టులు నల్గొండలో కేంద్రీకృతం కావడంతో ఆయా కేసుల విచారణకు ఈ జిల్లా కక్షిదారులు ఇబ్బందులు పడేవారు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో సూర్యాపేటలో జిల్లా కోర్టు ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇప్పటి వరకు సూర్యాపేటలో అదనపు జిల్లా న్యాయస్థానం, పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం, సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులతోపాటు రెండు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు ఉన్నాయి. ఇకపై ప్రధాన జిల్లా న్యాయస్థానంతోపాటు ప్రత్యేక చట్టాల కేసులు విచారించే న్యాయస్థానం, ఇతర న్యాయస్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఫలితంగా సూర్యాపేట న్యాయశాఖ పరంగా స్వతంత్ర జిల్లా కేంద్రంగా ఆవిర్భవించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని