logo

అన్వితారెడ్డితో జిల్లాకు గుర్తింపు: కలెక్టర్‌

ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్వితారెడ్డి జిల్లాకు గుర్తింపు తెచ్చిందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గురువారం తన చాంబర్‌లో సన్మానించి మాట్లాడారు

Published : 27 May 2022 03:06 IST

అన్వితారెడ్డిని సన్మానిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, తదితరులు

భువనగిరి, న్యూస్‌టుడే: ఎవరెస్ట్‌ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించిన మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్వితారెడ్డి జిల్లాకు గుర్తింపు తెచ్చిందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గురువారం తన చాంబర్‌లో సన్మానించి మాట్లాడారు. మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహించిన ఇద్దరు మహిళల్లో ఒకరు జిల్లాకు చెందినవారు కావడం గర్వంగా ఉందన్నారు. పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ముందు తల్లిదండ్రులు.. తర్వాత ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. తల్లి అంగన్‌వాడీ టీచర్‌, తండ్రి వ్యవసాయం చేస్తూ తమ ఇద్దరు కూతుళ్లలో ఒకరిని ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో అన్వితారెడ్డి తల్లి చంద్రకళ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, స్వరాజ్యం పాల్గొన్నారు.

పునరావాస పనులు వేగవంతం చేయండి

భువనగిరి: నృసింహసాగర్‌ జలాశయం నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతున్న తిమ్మాపూర్‌ నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా హుస్సేనాబాద్‌లో నిర్మించనున్న కాలనీని కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం పరిశీలించారు. జరుగుతున్న పనులను చూసి సూచనలు జారీ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించి గేటెడ్‌ కమ్యూనిటీగా అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈ గిరిధర్‌కు సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలునాటి పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు.

ఆరోగ్య ఉపకేంద్రాల తనిఖీ

యాదగిరిగుట్ట అర్బన్‌: మండలంలోని మల్లాపురం, గౌరయిపల్లి గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను కలెక్టర్‌ పమేలా సత్పతి గురువారం తనిఖీ చేశారు. గౌరాయిపల్లి ఆరోగ్య కేంద్రంలో ఓపీ సేవలు రోగులకు అందుబాటులో ఉండడంతో సిబ్బందిని ప్రశంసించారు. ఆరోగ్య కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు సిబ్బంది కలెక్టర్‌ దృష్టి తీసుకెళ్లడంతో గ్రంథాలయంలోకి ఆరోగ్య కేంద్రాన్ని మార్చేలా చర్యలు తీసుకోవాలని సర్పంచికి సూచించారు. మల్లాపురంలోని ఐకేపి కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కోనుగోలు దస్త్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం సేకరించాలని అధికారులను ఆదేశించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని