logo

కరెంటు కబళించింది.. కన్నీరు మిగిల్చింది

దేవుడి కార్యంలో పాలుపంచుకోవాలని వారు ఉత్సాహంగా ఏకమయ్యారు. సాములోరి వాహనాన్ని భద్రపరిచేందుకు ఉపక్రమించిన వారికి ఉపద్రవం మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. దేవుడి రథాన్ని రథశాలకు తరలిస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు

Published : 29 May 2022 06:21 IST

నల్గొండ జిల్లాపరిషత్‌, నాంపల్లి, న్యూస్‌టుడే

మృతదేహాలను తరలిస్తున్న వాహనం ఎదుట కుటుంబ సభ్యుల రోదనలు

దేవుడి కార్యంలో పాలుపంచుకోవాలని వారు ఉత్సాహంగా ఏకమయ్యారు. సాములోరి వాహనాన్ని భద్రపరిచేందుకు ఉపక్రమించిన వారికి ఉపద్రవం మృత్యువు రూపంలో ముంచుకొచ్చింది. దేవుడి రథాన్ని రథశాలకు తరలిస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ విషాద ఘటన శనివారం నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గత ఏప్రిల్‌ నెలలో శ్రీ రామనవమి ఉత్సవాలు నిర్వహించారు. ఆ సమయంలో రథాన్ని దేవాలయ ప్రాంగణంలో వదిలేశారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రథాన్ని రథశాలకు తరలించాలని పూనుకోగా అది వారి పాలిట మృత్యుశకటమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.


కుమార్తె పెళ్లి జ్ఞాపకాలు మరవకముందే..  

గ్రామానికి చెందిన పొగాకు మోహన్‌(40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయమే ఆధారం. నెల రోజుల క్రితమే పెద్ద కుమార్తె వివాహం చేశారు. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు పూర్తి కావడంతో ఆమెను తోడ్కొని వచ్చేందుకు నాంపల్లికి బయలుదేరారు. మార్గమధ్యలో రథాన్ని రథశాలకు తరలించాలని ఫోన్‌ రావడంతో అక్కడికి వెళ్లారు. ఈ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వివాహ వేడుకల జ్ఞాపకాలు ఇంకా మరవకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  


అయిదు నిమిషాల్లోనే..

కేతెపల్లికి చెందిన రాజబోయిన యాదయ్య (38)కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సన్నకారు రైతు. రథాన్ని తరలించాలని ఫోన్‌ రావడంతో వెళ్లారు. ఆయన వెళ్లిన ఐదు నిమిషాలకే విద్యుదాఘాతంతో మృతి చెందాడని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పెళ్లికి ఎదిగిన కుమార్తె, నిరుపేద కుటుంబం ఎలా జీవిస్తారోనని గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

ప్రమాదానికి కారణమైన రథం (ఇన్‌సెట్‌లో పైన తగిలి ఉన్న తీగలు)


సాయంగా వచ్చి..

గుర్రంపోడు మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు(25) కేతెపల్లి గ్రామానికి చెందిన పస్నూరు దయానందరెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. శనివారం యజమానితో పాటు గ్రామానికి వచ్చిన ఆయన రథశాలలోకి రథం తరలించే పనిలో సాయం చేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి ప్రాణాలు విడిచారు. 


తాడు పట్టుకోవడంతో బతికిపోయాం

దాసరి సత్తయ్య, కేతెపల్లి

రథాన్ని రథశాలలోకి తరలించాలని చెబితే ఎనిమిది మందిమి వెళ్లాం. కింద సీసీ రోడ్డు ఉండటంతో రథం ఆగలేదు. దీనికి పైన ఉన్న విద్యుత్తు తీగ తగలడంతో కరెంటు షాక్‌ వచ్చింది. మేము తాడు పట్టుకొని ఉండటంతో ప్రాణాలతో మిగిలాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని