logo

విద్యుత్తు స్తంభం విరిగి పడి కూలీ దుర్మరణం

చెట్ల కొమ్మలు నరుకుతుండగా అవి విద్యుత్తు తీగల మీద పడ్డాయి. వెంటనే విద్యుత్తు స్తంభం విరిగి కూలీ తల మీద పడడంతో అతను దుర్మరణం చెందాడు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కచురాజుపల్లి గ్రామం సుద్దబాయి

Published : 26 Jun 2022 02:33 IST

మృతుడు పకీరా

మాదాపూర్‌, న్యూస్‌టుడే: చెట్ల కొమ్మలు నరుకుతుండగా అవి విద్యుత్తు తీగల మీద పడ్డాయి. వెంటనే విద్యుత్తు స్తంభం విరిగి కూలీ తల మీద పడడంతో అతను దుర్మరణం చెందాడు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కచురాజుపల్లి గ్రామం సుద్దబాయి తండాకు చెందిన మెరావత్‌ పకీర (52) 11ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. అంబర్‌పేట బతుకమ్మకుంటలో భార్య, పిల్లలతో నివాసముంటూ కూలీగా పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లికి చెందిన గుత్తేదారు వెంకట్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం తన కుమారుడు దస్రుతోపాటు మరో ఐదుగురు కూలీలతో పకీర మాదాపూర్‌ చంద్రనాయక్‌తండా సమీపాన ఏవీవీ కోర్టు యార్డ్‌ అపార్టుమెంట్‌ వద్ద విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలు నరికేందుకు వచ్చారు. మధ్యాహ్నం ఆ పనిలో ఉండగా కొమ్మలు విద్యుత్తు తీగల మీద పడగానే స్తంభం విరిగి పకీర మీద పడింది. తలకు తీవ్రగాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా గుత్తేదారు పని చేయించడం కారణంగానే ప్రమాదం జరిగిందని, తమకు న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు, తోటి కూలీలు ఆందోళనకు దిగారు. అధికారులు, గుత్తేదారు వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ బైఠాయించారు. శనివారం రాత్రి 8.30 గంటల వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మాదాపూర్‌ ఎస్‌ఐ రాజేందర్‌ చెప్పారు. విద్యుత్తుశాఖ కొండాపూర్‌ డీఈగా పనిచేస్తున్న గురుత్మంత్‌ రాజు నివాసముంటున్న అపార్టుమెంట్‌ వద్దే ఈ సంఘటన జరగడం అనుమానాలకు తావిస్తోంది. గుత్తేదారు విద్యుత్తుశాఖ, అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కొమ్మల నరికివేత పనులను చేపట్టాడని ఏడీఈ గురత్మంత్‌రాజు రాజు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని