logo

కారును ఢీకొట్టిన ఘటనలో ఒకరి దుర్మరణం

కారును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన తుంగతుర్తి మండలం రావులపల్లి క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 30 Sep 2022 04:43 IST

తుంగతుర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: కారును ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన తుంగతుర్తి మండలం రావులపల్లి క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం సిద్ధిసముద్రం గ్రామానికి చెందిన ధరావత్‌ బూరోకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు రాజ్‌కుమార్‌ ఉన్నారు. చిన్న కూతురును తుంగతుర్తి మండలం యేనేకుంటతండాకు చెందిన బానోత్‌ సుమన్‌కి ఇచ్చి వివాహం జరిపించారు. అత్తారింటి నుంచి స్వగ్రామానికి బావ సుమన్‌తో కలిసి ధరావత్‌ రాజ్‌కుమార్‌ (16) ద్విచక్రవాహనంపై బయల్దేరారు. రావులపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. రాజ్‌కుమార్‌ ఎగిరి కారు వెనుక అద్దంపై పడ్డారు. తలకు తీవ్రగాయాలవటంతో స్థానికులు 108 వాహన సిబ్బందికి సమాచారమందించారు. రాజ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సుమన్‌.. సూర్యాపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓవైపు చెట్టంత ఎదిగిన కొడుకు మృతదేహం.. మరోవైపు అల్లుడి పరిస్థితి చూసి బూరో కుటుంబం ఆర్తనాదాలతో పలువురు కంటతడి పెట్టారు.


ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మరొకరు..

దేవరకొండ, న్యూస్‌టుడే: దేవరకొండ పట్టణ శివారులో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం షాకెల్లి గ్రామానికి చెందిన నీలం అశోక్‌ (22) అనే యువకుడు జ్వరం రావడంతో దేవరకొండ వెళ్లి బుధవారం రాత్రి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి 11.45గంటలకు సాయిబాబా గుడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయాలపాలైన అశోక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి సాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నందులాల్‌ తెలిపారు.


ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడు...

త్రిపురారం, న్యూస్‌టుడే : అదుపు తప్పి ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం త్రిపురారం మండలం దుగ్గేపల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండబోయిన మహేశ్‌ బత్తాయి తోటలో పనిచేసేందుకు మేకల రంజిత్‌(18), పలువురు కూలీలు వెళ్లారు. మహేశ్‌తోపాటు కూలీలతో కలిసి ట్రాక్టర్‌లో తిరుగుపయనమయ్యారు.  రంజిత్‌ ట్రాక్టర్‌ నడుపుతుండగా జానకిరామ ఎత్తిపోతల పథకం సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రంజిత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌ ట్రాలీ పక్కకు పడింది. అందులో ఉన్న నలుగురు కూలీలు క్షేమంగా ఉన్నారు. పక్కనే కూర్చున ట్రాక్టర్‌ యాజమాని కొండబోయిన మహేశ్‌కు బలమైన గాయాలు కావడంతో చిక్సిత కోసం మిర్యాలగూడ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శోభన్‌బాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని