logo

తగునా.. ఈ గలీజు పని..!

రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు. కానీ కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి సర్కారు భూమిని పప్పుబెల్లాల్లా పంచకోవడానికి సిద్ధమయ్యారు.

Updated : 10 Dec 2022 04:40 IST

నిబంధనలకు విరుద్ధంగా రూ.కోట్ల విలువైన ఆగ్రోస్‌ భూమి కాజేతకు అధికారుల యత్నం

ఆగ్రో ఇండస్ట్రీ స్థలంలో పెట్రోల్‌ బంకు నిర్మాణం పనులు చేస్తున్న నిర్వాహకులు

ఈనాడు, నల్గొండ - నీలగిరి, న్యూస్‌టుడే: రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు. కానీ కొంతమంది అక్రమార్కులతో చేతులు కలిపి సర్కారు భూమిని పప్పుబెల్లాల్లా పంచకోవడానికి సిద్ధమయ్యారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, అన్ని శాఖల అనుమతులు లేకుండానే అక్కడ పెట్రోల్‌బంకు నిర్వహణకు అధికారులు అనుమతులిచ్చేశారు. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్‌ రహదారి పక్కన వీటీ కాలనీలో సర్వే నెంబర్‌ 1498, 1506లో గల తెలంగాణ ప్రభుత్వ ఆగ్రో ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఆగ్రోస్‌)కు చెందిన రూ.20 కోట్ల విలువైన భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైనా.. సంబంధిత అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు.

అసలేం జరిగిందంటే..!

నల్గొండ పట్టణంలోని హైదరాబాద్‌ రహదారి పక్కన ఆగ్రోస్‌కు నాలుగెకరాల భూమి ఉండేది. ఇందులో 1.07 ఎకరాల భూమిని 2001లో వేలం ద్వారా ఓ ప్రైవేట్‌ వ్యక్తికి విక్రయించారు. మిగిలిన 2.33 ఎకరాల్లో...ఒక ఎకరం భూమిని రెండేళ్ల క్రితం తెరాస జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించింది. ఇంకా క్షేత్రస్థాయిలో 1.33 ఎకరాల భూమి ఉండాలి. అయితే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో భూమి అన్యాక్రాంతమవుతోంది. ఇక్కడ గజం రూ.లక్ష వరకు పలుకుతోంది. 1.33 ఎకరాల భూమిలో ఎనిమిది గుంటల భూమిని పెట్రోల్‌బంకు నిర్మాణానికి 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఇక్కడ ఒక దుకాణం (మడిగే) నిర్వహిస్తేనే నెలకు రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. ఏకంగా ఎనిమిది గుంటల భూమిని నెలకు రూ. 34,578 చొప్పున 30 ఏళ్లకు అధికారులు సంబంధిత వ్యక్తులకు లీజుకు అప్పగించారు. అగ్రిమెంట్‌ ఒప్పందంలో సంబంధిత స్థలానికి హద్దులను సైతం అనుమానాస్పదంగానే నమోదు చేశారు. 1.33 ఎకరాల స్థలంలో ఎనిమిది గుంటలు పెట్రోల్‌బంకు నిర్మాణానికి పోనూ మిగిలిన 1.25 ఎకరాలు క్షేత్రస్థాయిలో ఉండాల్సింది.అయితే ఇప్పుడు అంత భూమి లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హద్దుల్లో పడమర భాగంలో మిగిలిన ఆగ్రోస్‌కు చెందిన భూమి ఉండగా.. ఖాళీ స్థలం అని నమోదు చేయించారు. పెట్రోల్‌బంకు నిర్మాణానికి ఒప్పందం చేసుకున్న ఎనిమిది గుంటలతో పాటు ఆగ్రోస్‌కు చెందిన మిగిలిన స్థలాన్నీ కొట్టేసేందుకు ప్రైవేట్‌ వ్యక్తితో కలిసి అధికారులు పన్నాగం పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీని వెనుక నల్గొండలోని ఓ ఉన్నతాధికారితో సంబంధిత ఆగ్రోస్‌కు చెందిన ఓ అధికారి వెనకుండి చక్రం తిప్పుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం అక్కడ ఆగ్రోస్‌కు చెందిన ఎలాంటి భూమి లేదు. అంటే సుమారు ఎకరంన్నర భూమి అన్యాక్రాంతమయిందన్న మాట. దీని విలువ ప్రస్తుత బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 20 కోట్ల వరకు ఉంటుంది. ఈ - టెండర్‌ ద్వారా లీజుకు భూమి ఇవ్వాల్సిన అధికారులు, లీజు పంపిణీలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని తెలిసింది. నాలుగేళ్ల క్రితమే పెట్రోల్‌బంకు నిర్మాణానికి యత్నించినా... నివాస ప్రాంతాల్లో పెట్రోల్‌బంకు నిర్మాణం చేపట్టవద్దని స్థానికులు అడ్డుచెప్పారు.  

పొంతన లేని అధికారుల సమాధానం

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఆగ్రోస్‌ మేనేజర్‌ మధుసూదన్‌ను ‘ఈనాడు’ సంప్రదించగా...‘ ఎనిమిది గుంటల భూమిని లీజుకివ్వడానికి ఈ - టెండర్‌ను పిలిచాం. కానీ ఎంతకు ఇవ్వాలో వాల్యువర్‌ నివేదిక తీసుకోలేదు. మేమే ధర నిర్ణయించి, అధిక మొత్తం కోట్‌ చేసిన సంస్థకు లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకున్నాం. పెట్రోల్‌బంకు నిర్మాణం వద్దని కాలనీ వాసులు ఫిర్యాదు చేసింది నిజమే. అయితే కలెక్టరు అనుమతి తీసుకున్నాం..’..అని వెల్లడించారు.


గతంలోనే వద్దని ఆందోళన చేశాం

నివాస ప్రాంతాల్లో పెట్రోల్‌బంకు నిర్మాణం చేపట్టవద్దని గతంలోనే ఆందోళన చేశాం. దీంతో నాలుగేళ్లు ఆపారు. తిరిగి ఇప్పుడు నిర్మాణం ప్రారంభించారు. కాలనీ వాసులతో కలిసి ఆందోళన పెట్రోల్‌బంకు ఆపేందుకు ఆందోళన చేస్తాం.              

- రావుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని