logo

సహకారంలో.. వ్యాపారం

ఉమ్మడి జిల్లా పరిధిలోని 107 సహకార సంఘాల్లో.. రైతులకు సేవలు అందించడంతో పాటు  విజయ సంస్థకు సంబంధించి నూనెలు, బియ్యం, గోధుమపిండి వంటి ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.

Published : 30 Mar 2023 04:17 IST

నల్గొండ డీసీసీబీ

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా పరిధిలోని 107 సహకార సంఘాల్లో.. రైతులకు సేవలు అందించడంతో పాటు  విజయ సంస్థకు సంబంధించి నూనెలు, బియ్యం, గోధుమపిండి వంటి ఉత్పత్తులను విక్రయించేందుకు వీలుగా కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సహకార సంఘాలు ధాన్యం కొనుగోళ్లు, ఎరువులు, విత్తనాలు, పెట్రోలు బంకులు నిర్వహణ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఉన్నాయి. ప్రతి సంఘం పరిధిలో ఒక కామన్‌ సర్వీస్‌ సెంటర్లు ఉండేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఉన్న 107 సహకార సంఘాలు కంప్యూటీకరణ పూర్తయింది. ఈ క్రమంలోనే కామన్‌ సర్వీసు సెంటర్లు ఏర్పాటు సులభతరం కానుంది. ఈ కేంద్రాల నిర్వహణపై డీసీసీబీ అధికారులు సంఘాల వారికి ఇటీవల తెలిపారు. ఆధార్‌ సవరణలు, బీమా డబ్బుల చెల్లింపులు, పీఎం కిసాన్‌ యోజన రిజిస్ట్రేషన్‌, పాన్‌కార్డుకు దరఖాస్తు చేయడం, తపాలా సేవలు వినియోగించుకోవడం వంటివి దాదాపు 300 సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఆయిల్‌సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా వంటనూనెతో పాటు 66 రకాల బ్రాండ్ల ఆమ్మకాలకు సంస్థకు అవకాశం లభిస్తోంది.

ఆదాయ వనరులు పెంచుకునేలా

సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలివ్వడం, వసూలు చేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదు. ధాన్యం కొనుగోలు, ఎరువులు విత్తనాల విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. ఛైర్మన్ల జీతభత్యాలు, సహకార సంఘాల కార్యనిర్వహణాధికారుల, ఇతర సిబ్బంది జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఆదనపు సిబ్బంది కూడా పని చేస్తున్నారు. దీంతో సంఘాల ఆదాయ వనరులు పెంచుకునేలా కార్యాచరణ చేపడుతున్నారు.


సంఘాల ద్వారా విక్రయాలు
- మదన్‌మోహన్‌, సీఈవో డీసీసీబీ నల్గొండ.

విజయ ఉత్పత్తులు సహకార సంఘాల ద్వారా విక్రయించేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. కామన్‌ సర్వీస్‌ సెంటర్లు వచ్చే నెలలో ప్రారంభం అవుతాయి. మరిన్ని సేవలు సంఘాల ద్వారా అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని