logo

రాగల 15 రోజుల్లో..!

రబీ సీఎంఆర్‌ బియ్యం బకాయిలు 2021-22 సంవత్సరానికి సంబంధించి 15 రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ చరవాణి సందేశాలు పంపించారు.

Published : 03 Jun 2023 05:04 IST

సీఎంఆర్‌ పాత బకాయిలు పూర్తి చేయాలని ఆదేశం

హుజూర్‌నగర్‌: సీతారాంనగర్‌ గోదాముకు వచ్చిన బియ్యం లారీలు

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రబీ సీఎంఆర్‌ బియ్యం బకాయిలు 2021-22 సంవత్సరానికి సంబంధించి 15 రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ చరవాణి సందేశాలు పంపించారు. గతంలో నెల రోజులు పెంచి ప్రత్యేకంగా సర్క్యులర్‌ విడుదల చేసేవారు. ఈసారి మాత్రం కేవలం 15 రోజులు మాత్రమే అవకాశం కల్పిస్తూ అదీ 125 శాతం జరిమానాతో చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు కూడా చరవాణి సందేశం ద్వారా పంపించారు. ఉన్న బకాయిలు వెంటనే పూర్తి చేయాలని ఆ సందేశంలో పేర్కొన్నారు. వాస్తవానికి మే 31 నాటికి మిల్లర్లందరూ తమ బకాయిలు చెల్లించాల్సి ఉంది, కానీ ఇంకా చెల్లింపులు అలాగే ఉండటంతో చివరి అవకాశంగా పౌర సరఫరాలశాఖ అధికారులు ఇలా ఆదేశాలు జారీ చేశారు. దీన్ని అత్యంత ప్రాధాన్యం గల విషయంగా తీసుకోవాలని వారి సందేశంలో తెలిపారు.

ఇలా అనుకున్నారు..

లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వని మిల్లులో ఉన్న ధాన్యం స్వాధీనం చేసుకోవాలని మొదట నిర్ణయించారు. గత సంవత్సరం బకాయిలు ఉన్న జిల్లాలోని 49 మిల్లులకు నోటీసులు జారీ చేశారు. వెంటనే బియ్యం ఇవ్వని మిల్లులకు జరిమానాలతో పాటు, మిల్లుల్లో ఉన్న ధాన్యం స్వాధీనం చేసుకుంటామని అప్పుడు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలకు కొందరు మిల్లర్లు స్పందించి కొంత మేర బియ్యం ఇచ్చారు. నోటీసులు, హెచ్చరికలు జారీ చేసి ఆరు నెలలు కావొస్తున్నా కొందరు మిల్లర్లు పట్టించుకోవడం లేదు. దీంతో జిల్లాలో ఇంకా 29,242 మెట్రిక్‌ టన్నుల బియ్యం పెట్టాల్సి ఉంది. వీటి విలువ దాదాపు రూ.100 కోట్లు. నల్గొండ, యాదాద్రి జిల్లాల నుంచి స్పందన ఉన్నా సూర్యాపేట జిల్లా నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అధికారులు చివరి అవకాశం అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బకాయిల పరిస్థితి ఇలా..

నల్గొండ జిల్లా నుంచి 2,21,669 మెట్రిక్‌ టన్నులు 2021-22 రబీకి ఇవ్వాల్సి ఉండగా పూర్తిగా ఇచ్చి రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంది. యాదాద్రి జిల్లా 1,40,807 మెట్రిక్‌ టన్నులు పెట్టాల్సి ఉండగా.. ఇంకా 495 మెట్రిక్‌ టన్నులు మిగిలి ఉంది. సూర్యాపేట జిల్లా నుంచి 1,44,904 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా గత నెల 19 వరకు 1,15,662 మెట్రిక్‌ టన్నులు బియ్యం పెట్టారు. అన్ని జిల్లాల నుంచి కొంత మేర స్పందన ఉన్నా సూర్యాపేట జిల్లా మిల్లర్లు కొందరు మొండిగా తయారు కావడం వెనక అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. 2021-22 రబీ బకాయిల వసూలుకు అధికారులు నానా తంటాలు పడుతుండగా, 2022-23 వానాకాలం సీఎంఆర్‌ బియ్యం లక్ష్యాలు కూడా ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లా నుంచి వానాకాలం 23,229 మెట్రిక్‌ టన్నుల బియ్యం (11శాతం) మాత్రమే ఇచ్చారు. నల్గొండ జిల్లా 54 శాతం, యాదాద్రి జిల్లా 32 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని