logo

సోడా తాగి.. బొమ్మలు పరిశీలించి..!

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లోని గ్రీన్‌ ఇండస్త్ట్రీయల్‌ పార్కులో మంగళవారం నిర్వహించారు.

Updated : 07 Jun 2023 04:08 IST

దండుమల్కాపూర్‌ పారిశ్రామికవాడలో నాలుగు గంటల పాటు మంత్రి కేటీఆర్‌ పర్యటన
ఉపాధిలో స్థానికులకే తొలి ప్రాధాన్యమని ఉద్ఘాటన
ఈనాడు, నల్గొండ- చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే

బొమ్మల పార్కు శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీ, చిత్రంలో కలెక్టర్‌ తదితరులు

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవాన్ని చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌లోని గ్రీన్‌ ఇండస్త్ట్రీయల్‌ పార్కులో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ పారిశ్రామిక పార్కులో దాదాపు నాలుగు గంటల పాటు గడిపారు.

* ఉదయం 9.50 గంటలకు వచ్చిన ఆయన మధ్యాహ్నం రెండు గంటల వరకు అక్కడే ఉన్నారు. తొలుత ప్రాంగణంలో బొమ్మల పార్కుకు శంకుస్థాపన చేసి అక్కడ పలు కంపెనీలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లోని పలు బొమ్మలను పరిశీలించారు. అనంతరం పార్కులో ఇప్పటికే నెలకొల్పిన వ్యవసాయ, సోడా కంపెనీల్లాంటి పలు యూనిట్లను సందర్శించారు. సదరు కంపెనీలు ఉత్పత్తి చేసిన సోడా తాగారు.

పారిశ్రామిక పార్కులో ఉత్పత్తులను పరిశీలిస్తున్న మంత్రులు

* 16 మంది పారిశ్రామికవేత్తలకు స్థలాల పత్రాలను అందజేశారు. దడుమల్కాపూర్‌ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కు నిర్మాణం పూర్తయితే 40 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడంతో పాటు ఈ పారిశ్రామిక వాడలో స్థానికులకే ఉపాధిలో తొలి ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

* తొలుత కొయ్యలగూడెంలో పర్యటించిన కేటీఆర్‌.. చనిపోయిన ఇద్దరు చేనేత కార్మికుల కుటుంబాలకు మంజూరైన నేతన్న బీమా చెక్కులను అందజేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చేనేత కార్మికులతో పాటు, భూదాన్‌పోచంపల్లి చేనేత కార్మికులకు ఒక క్లస్టర్‌గా తీసుకొని వారి సమస్యలను పరిష్కరించాలని చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ బుద్దాప్రకాశ్‌ జ్యోతికి సూచించారు.

స్టాళ్లను సందర్శిస్తున్న పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, యాదాద్రి కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌


ఏ రాష్ట్రంలోనూ ఇలా పార్కులు లేవు..

సభలో పలువురు పారిశ్రామికవేత్తలు

తెలంగాణలో మాదిరిగా ఎక్కడా ఇలా సకల సౌకర్యాలతో పారిశ్రామిక పార్కులు లేవు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. కేటీఆర్‌ పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాక మా కష్టాలు తీరాయి. నాడు పదుల మందికి ఉపాధి కల్పిస్తే.. నేడు వందల సంఖ్యలో కార్మికులు తమ పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఏడాదికి రూ.కోటి టర్నోవర్‌ వ్యాపారం ఇప్పుడు రూ.40 కోట్లకు చేరుకుందని, ఇదంతా ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అని ఓ పారిశ్రామికవేత్త మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో పలువురు పారిశ్రామికవేత్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


ఆరు నెలల్లోనే నాణ్యమైన విద్యుత్తు

కె.సుధీర్‌రెడ్డి, తెలంగాణ పరిశ్రమల సమాఖ్య (టిఫ్‌) అధ్యక్షుడు

ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో వారంలో మూడు రోజులు పరిశ్రమలు నడిచేవి కావు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇంకా విద్యుత్తు సమస్య తీవ్రతరం అవుతుందని చెప్పేవారు. కానీ.. తెలంగాణ వచ్చాక ఆరు నెలల్లోనే విద్యుత్తు సమస్య తీరింది. ఉమ్మడి రాష్ట్రంలో 5 వేల ఎకరాల్లో పారిశ్రామిక పార్కులు ఉంటే తెలంగాణ వచ్చాక 1.50 లక్షల ఎకరాలకు పెరిగాయి. టిఫ్‌ ఆధ్వర్యంలో 540 ఎకరాల్లో పార్కు ఉండగా.. ఇంకా 1850 ఎకరాల్లో పలు పార్కులు నిర్మాణం కాబోతున్నాయి.


రాష్ట్రంలో నంబర్‌ వన్‌ పార్కు ఇది..

గ్యాదరి బాలమల్లు, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌

దండుమల్కాపురం పారిశ్రామిక పార్కు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కేటీఆర్‌ కలలు కన్న పార్కు సాకారం అవుతోంది. ఇక్కడ కల్పించిన వసతులను చూసి పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమకు తెలిసిన పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయించాలని సిఫారసులు చేస్తున్నారు. మరో నాలుగైదు వేల ఎకరాలను కేటాయిస్తే ఇలానే అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు