logo

కాంగ్రెస్‌ గూటికి మోత్కుపల్లి, నేతి విద్యాసాగర్‌

మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడు, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరారు.

Published : 28 Oct 2023 05:20 IST

ఆలేరు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడు, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నుంచి ఐదు సార్లు, తుంగతుర్తి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆశీర్వాదంతో 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెదేపాను వీడి 1999లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2009లో మళ్లీ తెదేపాలో చేరి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మూడు సంవత్సరాల క్రితం భాజపాలో చేరారు. దళితబంధు ఒక మహోన్నతమైన పథకం అని కేసీఆర్‌ను కీర్తిస్తూ ఏడాదిన్నర క్రితం భారాసలో చేరారు. ప్రభుత్వ పరంగా మంచి పదవి వస్తుందని ఆశించారు. ఆశ నెరవేరకపోవడం, ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. టికెట్‌ను ఇచ్చేందుకు భారాస అధిష్ఠానం సుముఖత చూపకపోవడంతో కొద్ది రోజులుగా భారాస నాయకత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. చివరకు కాంగ్రెస్‌లో చేరారు.

నకిరేకల్‌, న్యూస్‌టుడే: శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్‌, భారాస నాయకుడు నేతి విద్యాసాగర్‌, నకిరేకల్‌ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, బీజీఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బచ్చుపల్లి గంగాధర్‌రావు శుక్రవారం దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. దాదాపు రెండేళ్ల నుంచి భారాస నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విద్యాసాగర్‌ సొంత గూటికి చేరినట్లయింది. నేతిని బుజ్జగించేందుకు మంత్రి జగదీశ్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆయన్ను కేటీఆర్‌ వద్దకు తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. 2007, 2009లో కాంగ్రెస్‌ నుంచి విద్యాసాగర్‌ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2011 జూన్‌లో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో మండలి విభజన సమయంలో కాంగ్రెస్‌ నుంచి తెరాస(నేటి భారాస)లో చేరారు. 2015లో తెరాస నుంచి ఎమ్మెల్యేల కోటాలో మూడోసారి ఎమ్మెల్సీగా, మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2021 జూన్‌లో ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని