logo

బరిలో.. మరో నలుగురు

భాజపా తన రెండో జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, దేవరకొండ, హుజూర్‌నగర్‌, ఆలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండలో మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం దక్కగా.. దేవరకొండలో 2014లో తెరాస తరఫున పోటీ చేసిన లాలునాయక్‌కు టిక్కెట్‌ ఇచ్చారు.

Published : 03 Nov 2023 05:27 IST

భాజపా రెండో విడత జాబితా విడుదల

ఈనాడు, నల్గొండ: భాజపా తన రెండో జాబితాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, దేవరకొండ, హుజూర్‌నగర్‌, ఆలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండలో మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం దక్కగా.. దేవరకొండలో 2014లో తెరాస తరఫున పోటీ చేసిన లాలునాయక్‌కు టిక్కెట్‌ ఇచ్చారు. ఆలేరులో గతేడాది భారాస నుంచి భాజపాలో చేరిన తుర్కపల్లికి చెందిన పడాల శ్రీనివాస్‌కు టిక్కెట్‌ ఇవ్వగా.. ఇటీవలే భారాసలో చేరిన నేరేడుచర్ల పురపాలిక వైస్‌ ఛైర్మన్‌ చల్లా శ్రీలతా రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి తొలిసారి పోటీ చేయనున్నారు. తాజా జాబితాతో కలిపి మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది. తొలి విడతలో సంకినేని వెంకటేశ్వరరావు (సూర్యాపేట), కడియం రామచంద్రయ్య (తుంగతుర్తి), కంకణాల నివేదితరెడ్డి (నాగార్జునసాగర్‌), గూడూరు నారాయణరెడ్డి (భువనగిరి)లను అభ్యర్థులుగా ప్రకటించింది. మరో నాలుగు స్థానాలైన మునుగోడు, కోదాడ, నకిరేకల్‌, మిర్యాలగూడలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. జనసేనతో పొత్తు కారణంగా కోదాడను ఆ పార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి, తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మేకల సతీష్‌రెడ్డి పోటీ చేయనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జనసేన పొత్తుల్లో కోదాడను కేటాయించొద్దని ఆ పార్టీ నేతలు రెండ్రోజుల నుంచి ఆ పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నారు.  

మునుగోడుపై ఉత్కంఠ..!

మునుగోడు స్థానంలో భాజపా తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ దక్కకపోవడంతో చలమల్ల కృష్ణారెడ్డి బుధవారం దిల్లీలో కిషన్‌రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. అయితే ఆయన పేరు తాజా జాబితాలో లేకపోవడం గమనార్హం. బీసీ నినాదం నేపథ్యంలో పార్టీ ఇక్కడి నుంచి బలమైన బీసీ నేతను రంగంలోకి దింపుతుందా అనే సందేహం పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. అలా అయిన పక్షంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ బరిలో ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు కృష్ణారెడ్డి టిక్కెట్‌ హామీతోనే పార్టీలో చేరారని..ఆయన మునుగోడు నుంచి బరిలో ఉండటం ఖాయమని, మూడో విడతలో ఆయన పేరు వస్తుందని పార్టీ ఉన్నతస్థాయి వర్గాలు ‘ఈనాడు’కు వెల్లడించాయి.

  • నకిరేకల్‌లో పోటీకి పాల్వాయి రజినీకుమారి ఏర్పాట్లు చేసుకోగా...ప్రస్తుతం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆమె పోటీ చేయడానికి సుముఖంగా లేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఇక్కడి టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసిన రామన్నపేట మాజీ సర్పంచి నకిరేకంటి మొగులయ్య, చిట్యాల మాజీ జడ్పీటీసీ శేపూరి రవీందర్‌, గోలి ప్రభాకర్‌లలో ఒకరికి టిక్కెట్‌ దక్కనుంది. మిర్యాలగూడ నుంచి మరోసారి సాధినేని శ్రీనివాస్‌రావు బరిలో ఉండే అవకాశం ఉందని, ఆయన పోటీకి సుముఖంగా లేకుంటే కొత్త వారికి అవకాశం ఉంటుందని పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

15 తర్వాత ప్రధాని రాక..!

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నల్గొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్‌ను ప్రకటించాయి. ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ తేదీల్లోనే సభ నిర్వహించాలని అనుకున్నా.. నామినేషన్ల కార్యక్రమం ఉండటంతో బహిరంగ సభకు జనసమీకరణ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులకు విన్నవించినట్లు సమాచారం. దీంతో నామినేషన్ల అనంతరం అంటే ఈ నెల 15 తర్వాత నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

నల్గొండ : మాదగాని శ్రీనివాస్‌గౌడ్‌

విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో, భాజపా యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీనివాస్‌గౌడ్‌ అనంతరం తెదేపాలో పనిచేశారు. అక్కడ ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంటూ 2018లో తిరిగి భాజపాలో చేరారు. రెండు దశాబ్దాలుగా నల్గొండ జిల్లా కేంద్రంలో విద్యాసంస్థలను నడుపుతున్నారు. గత కొన్నాళ్లుగా పార్టీలో చురుగ్గా ఉంటూ నల్గొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషిచేశారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఆలేరు : పడాల శ్రీనివాస్‌

మూడుసార్లు తుర్కపల్లి మండలం భారాస అధ్యక్షుడిగా, ఆలేరు మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన పడాల శ్రీనివాస్‌ గతేడాది అమిత్‌షా సమక్షంలో మునుగోడులో భాజపాలో చేరారు. శ్రీనివాస్‌ తండ్రి చంద్రం 2001లో భారాసలో చేరి ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ తుర్కపల్లి మండలంలో పలు విద్యాసంస్థలను నడుపుతున్నారు. స్థిరాస్తి, రవాణా వ్యాపారాలను నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ తొలిసారి ఇక్కడి నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

దేవరకొండ : కేతావత్‌ లాలూనాయక్‌

భారతీయ జీవిత బీమా (ఎల్‌ఐసీ) డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన లాలూనాయక్‌ విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేశారు. అనంతరం 2014లో తెరాస (ఇప్పటి భారాస)లో చేరి దేవరకొండ నుంచి తొలిసారి పోటీ చేసి 40 వేల ఓట్లు సాధించారు. తిరిగి భాజపాలో చేరారు. ఆయన భార్య లక్ష్మీ భాజపా నుంచి ఎంపీటీసీ, కౌన్సిలర్‌గా విజయం సాధించారు. ప్రస్తుతం సర్పంచిగా పనిచేస్తున్నారు. భాజపా తరఫున తొలిసారి, మొత్తంగా రెండోసారి అసెంబ్లీ బరిలో ఉన్నారు.

హుజూర్‌నగర్‌ : చల్లా శ్రీలతారెడ్డి

నేరేడుచర్ల పురపాలిక వైస్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్న చల్లా శ్రీలతా రెడ్డి తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచారు. ఇటీవలే భారాస నుంచి భాజపాలో చేరడం గమనార్హం. ఆమె భర్త విజయ్‌భాస్కర్‌రెడ్డి అబుదాబిలో పర్యావరణ నిపుణుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆమె 2019లో భారాసలో చేరి నేరేడుచర్ల పురపాలికలో కౌన్సిలర్‌గా పోటీచేసి విజయం సాధించారు. ఆమె సమీప బంధువు పోరెడ్డి కిశోర్‌రెడ్డి భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌ ఆంధ్ర మహిళాసభ కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని