logo

పురంలో.. దాహం తీరేలా..!

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్‌-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

Published : 28 Mar 2024 05:23 IST

నేరేడుచర్లలో సిబ్బందితో బోరు బాగు చేయిస్తున్న పురఛైర్మన్‌ ప్రకాశ్‌  

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్‌-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఈ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో చేపట్టే పనులు రెండో ప్యాకేజీలో ఉన్నాయి. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఎన్నికల తర్వాత ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గుత్తేదారులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది. నేరేడుచర్ల పురపాలికను మూడు జోన్లుగా విభజించి, రెండు జోన్లలో 300 కేఎల్‌ సామర్థ్యం గల రెండు ట్యాంక్‌లు, మూడో జోన్‌లో 600 కేఎల్‌ సామర్థ్యం గల ఒక ట్యాంకు నిర్మించనున్నారు. ఆవాస ప్రాంతాలన్నింటిలో అవసరమైన మేర తాగునీటి పైప్‌లైన్లు వేయనున్నారు. ఇలా అన్ని పురపాలికల్లోనూ వారి అవసరాలను బట్టి ఏర్పాట్లు చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌ పురపాలికలకు మాత్రం ఇందులో నిధుల కేటాయింపు జరగలేదు.

జనాభాకు అనుగుణంగా ప్రణాళిక

పురపాలికల్లో భవిష్యత్తులో పెరగనున్న జనాభాకు అనుగుణంగా తాగు నీటి సరఫరా చేయడం లక్ష్యంగా  కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న జనాభా, భవిష్యత్తులో పెరగనున్న సంఖ్య.. ఇప్పుడు, అప్పుడు అవసరమయ్యే నీటి సరఫరా లెక్కలను అంచనా వేశారు. ఆయా పురపాలికల నుంచి అవసరమైన సమాచారం తీసుకుని పథక రూపకల్పన చేశారు. తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ), హైదరాబాద్‌ అమృత్‌-2.0 పథకానికి నిధులు విడుదల చేసే ఏజెన్సీ.


టెండర్లు ఖరారయ్యాయి
కె.వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ, ప్రజారోగ్యశాఖ, నల్గొండ

అమృత్‌ 2.0 పథకం టెండర్లు ప్యాకేజీ-2లో ఖరారయ్యాయి. ఎన్నికలైన తర్వాత పనులు మొదలు పెడతాం. పనులు పూర్తి చేసేందుకు ఏజెన్సీలకు రెండేళ్ల కాలపరిమితి ఉంది. అన్ని పురపాలికల నుంచి వారి తాగు నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకుని పథక రచన చేశాం. పురపాలికల్లోని ఆవాసప్రాంతాలకు సైతం పూర్తి స్థాయిలో తాగు నీరందించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని