logo

పురంపై సైబర్‌ ఉచ్చు..!

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో రాకేశ్‌ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్‌ నంబరు 63054 68441 నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

Published : 27 Apr 2024 02:45 IST

జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో రాకేశ్‌ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్‌ నంబరు 63054 68441 నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మున్సిపల్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను.. మీరు ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజు, లేబర్‌ ఛార్జీ ఫీˆజు వాటిపై పెనాల్టీ కలిపి రూ.4730 చెల్లించాల్సి ఉందని, ఈ రోజే చివరి రోజంటూ , ఇప్పుడైతే రూ.1820 చెల్లిస్తే పెనాల్లీ రద్దు చేస్తామని వెంట వెంట ఫోన్‌ చేశారు. సెల్‌ నంబరు 99988 87397కు ఫోన్‌ పే ద్వారా చెల్లించాలని చెప్పడంతో ఆ వ్యాపారి రెండు సార్లు రూ.1300, ఆ వెంటనే రూ.520 మొత్తంగా రూ.1820 చెల్లించారు. వాటికి సంబంధించిన రసీదు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి సోమవారం మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి జరిగిన ఘటన పుర అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరికి ఇద్దరూ కాదు వందల సంఖ్యలో వ్యాపారులు డబ్బులు చెల్లించినట్లు తెలిసింది.


నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే:  నల్గొండ జిల్లా కేంద్రంలో వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని కొందరు సైబర్‌ నేరగాళ్లు రంగంలో దిగారు. ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజులు, లేబర్‌ ఛార్జిల పేరుతో అక్రమాలకు తెరలేపారు. పెద్ద పెద్ద వ్యాపారులతో పాటు కొత్తగా ఏర్పాటు చేసుకున్న దుకాణ దారులను ఎంచుకుంటున్నారు. నల్గొండ మున్సిపల్‌ ఉద్యోగుల పేర వారికి రెండు మూడు రోజులుగా ఫేక్‌ ఫొన్‌కాల్స్‌ చేస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు లేబర్‌ ఛార్జిలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. గడువులోపు చెల్లించకుంటే దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వ్యాపారులు వణికిపోయి అడినన్ని డబ్బులు ఫోన్‌ పే ద్వారా పంపిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల వలల్లో పడి లబోదిబోమంటున్నారు.

పోలీసులకు ఫిర్యాదు..

డబ్బులు చెల్లించమంటూ రసీదులు, ట్రేడ్‌లైసెన్స్‌ పత్రాలు ఇవ్వలేదని సోమవారం కొంత మంది వ్యాపారులు మున్సిపల్‌ కమిషనర్‌ ముసాబ్‌ అహ్మద్‌ సయ్యద్‌తోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్లును సంప్రదించారు. చాలా మంది ఇదే విషయంపై రావడంతో అధికారులకు అనుమానం వచ్చి అసలు విషయం తెలుసుకున్నారు. పుర ఉద్యోగుల పేర వ్యాపారులకు ఫేక్‌ ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారని గుర్తించారు. గత ఏడాది కూడా ఇదే మాదిరిగా జరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సైబర్‌ నేరగాళ్లుగా అనుమానంతో సోమవారం వ్యాపారులు ఇచ్చిన ఫోన్‌నంబర్లు, ఫోన్‌ పే చేసిన నంబర్లపై పుర అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్‌కాల్స్‌ను నమ్మొద్దు..
ముసాబ్‌ అహ్మద్‌ సయ్యద్‌, కమిషనర్‌, నల్గొండ పురపాలిక

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులను ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా చెల్లించాలని ఫోన్‌ చేస్తే నమ్మొద్దు. మున్సిపల్‌ సిబ్బంది నేరుగా దుకాణాల వద్దకు వస్తారు. అది కూడా నగదు ముట్టినట్లు రసీదులు ఇస్తేనే బిల్లులు చెల్లించాలి. సైబర్‌ నేరగాళ్ల నుంచి వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. మరో సారి ఫోన్‌ వస్తే సమీపంలోని పోలీస్‌ స్టేషన్లల్లో ఫిర్యాదు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని