logo

గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎంలో చోరీకి యత్నం

గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 30 Apr 2024 06:24 IST

మంటలు చెలరేగి నగదు దగ్ధం

దగ్ధమైన నగదు ఉన్న బాక్సులు

కోదాడ గ్రామీణం, న్యూస్‌టుడే: గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని గుడిబండలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండలోని యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో శనివారం సాయంత్రం సిబ్బంది రూ.10 లక్షల నగదును జమచేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించి సీసీ కెమెరా, సైరన్‌ తీగలను కత్తిరించారు. గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో లోపలి బాక్సులను తెరిచేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్యాస్‌ కట్టర్‌ నుంచి వెలువడిన నిప్పు రవ్వలు నగదు ఉన్న బాక్స్‌కు అంటుకొని మంటలు వ్యాపించాయి. భయంతో దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అన్ని బాక్సులకు మంటలు అంటుకోవడంతో నగదు కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రూ.1.80 లక్షలు ఖాతాదారులు డ్రా చేసుకోగా మిగిలిన సొమ్ము కాలిపోయినట్లు బ్యాంక్‌ మేనేజర్‌ నాగునాయక్‌ ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని