logo

ఓటుకు నోటు కేసును ప్రభావితం చేస్తారేమో?

భారాస అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.

Published : 03 May 2024 02:00 IST

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: భారాస అధినేత కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల నిషేధం విధించడం ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రలో భాగమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ లోక్‌సభ భారాస అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మోదీ, రేవంత్‌రెడ్డి విద్వేష ప్రసంగాలు, ఫేక్‌ వీడియోలు ఈసీకి కనిపించలేదా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు నేత కార్మికులను అవమానకరంగా మాట్లాడిన సందర్భంగా స్పందించిన కేసీఆర్‌ మాటలను వక్రీకరించారని పేర్కొన్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్‌ ఉండటమనేది చారిత్రక అవసరమని ప్రజలు గుర్తించారని, అందుకే భారాసకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రేవంత్‌ అవినీతి గురించి తెలిసినా మోదీ విచారణ సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. నిషేధాలేవీ కేసీఆర్‌ ప్రభంజనాన్ని నిలవరించలేవన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16 సీట్లను భారాస కైవసం చేసుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రభావితం చేస్తారని అనుమానంగా ఉందని, అందుకే ఇతర రాష్ట్రంలోకి మార్చాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. న్యాయస్థానం నుంచి సరైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని