logo

చెరువును చెరబట్టి.. అక్రమంగా తవ్వేసి

అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది.

Published : 03 May 2024 02:16 IST

తిప్పర్తి చెరువులో జేసీబీతో ఇష్టానుసారంగా తవ్వకాలు

తిప్పర్తి, న్యూస్‌టుడే: అక్రమార్కులు చెరువులపై పడ్డారు. తాటి చెట్టంత లోతుల్లో జేసీబీలతో తవ్వుతూ వందలాది వాహనాలతో మట్టి తరలిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో చెరువులు ఎండిపోవడం అక్రమార్కులకు కలిసొచ్చింది. అధికారులను మచ్చిక చేసుకుని.. మట్టి వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో చెరువుల ఆనవాళ్లు కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. తిప్పర్తిలోని మర్రిగూడ సమీపంలోని సోమరాజు చెరువులో కొందరు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఎవరికి వారు చెరువు మట్టిని లూటీ చేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. జేసీబీలతో ఇష్టానుసారంగా చెరువులో మట్టిని తవ్వుతూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా  తరలిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై సంబంధిత అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అధికారులు కేవలం మొక్కుబడిగా వచ్చి మట్టి తవ్వొద్దని మౌఖికంగా చెప్పి చేతులు దులుపుకొంటున్నారు. మరుసటి రోజు తిరిగి మళ్లీ శరామామూలే. రైతులు చెరువు మట్టిని తరలించుకోవాలన్నా అధికారుల అనుమతి తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి ఇచ్చాక సంబంధిత అధికారులు హద్దులు ఏర్పాటు చేశాక.. నిర్ణీత లోతు తవ్వుతూ వారి పర్యవేక్షణలోనే మట్టిని తరలించుకోవాలి.  రైతులు కాకుండా మట్టిని ఇతర వ్యాపార పనులకు తరలిస్తున్నారు. స్తిరాస్థి వ్యాపారులు, ఇటుక బట్టీలకు అక్రమంగా తీసుకెళుతున్నారు.  నీళ్లు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు చెరువు మట్టిని తోడేస్తున్నారు. జేసీబీతో లోతైన గుంతలు పెడుతూ చెరువును ప్రమాదకరంగా మారుస్తున్నారు. మండలంలో నూతన మట్టిరోడ్ల నిర్మాణం కోసం గుత్తేదారులు ఇదే చెరువు మట్టిని తరలిస్తున్నారు. చెరువు మట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చిందని.. పోలీసుల సహాయంతో వారిపై చర్యలు తీసుకుంటామని   తహసీల్దార్‌ స్వప్న తెలిపారు.  గ్రామస్థుల ఫిర్యాదుతో చెరువును పరిశీలించామని, అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ శివరామ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని