logo

రాగల తొమ్మిది రోజుల్లో..!

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి.

Published : 03 May 2024 05:36 IST

లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తం

ఈనాడు, నల్గొండ : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో ప్రధాన పార్టీలు ముమ్మర ప్రచారానికి సమాయత్తమవుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించిన పార్టీలు, అభ్యర్థులు ఇక ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించనున్నారు. అదే సమయంలో పార్టీ అగ్రనేతలతో కార్నర్‌ మీటింగ్‌లు, రోడ్‌షోల ద్వారా ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ఆయా పార్టీల అధిష్ఠానాలు సూచించడంతో..రాబోయే తొమ్మిది రోజుల్లో విస్తృత ప్రచారం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.


సమన్వయ లోపం లేకుండా కాంగ్రెస్‌

అధికార కాంగ్రెస్‌ తమ పార్టీ అభ్యర్థులు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటూ మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, భువనగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో ఇప్పటి వరకు రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించగా..రాబోయే తొమ్మిది రోజులు రెండు లోక్‌సభ స్థానాల్లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇంటింటి ప్రచారం చేయాలని పార్టీ బ్లాక్‌ స్థాయి కార్యకర్తలు, నాయకులకు ఆదేశాలు అందాయి. మరోవైపు నల్గొండ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి లోక్‌సభ పరిధిలోని పలు సెగ్మెంట్లలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. తాజాగా బుధవారం నల్గొండలో న్యాయవాదులను కలిసి ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి సైతం పాల్గొన్నారు. నల్గొండ లోక్‌సభకు  మంత్రి ఉత్తమ్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండగా..జానారెడ్డి ఇద్దరు మంత్రులతో పాటూ సీనియర్‌ నేతల్లో సమన్వయ లోపం లేకుండా చూస్తున్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో కలిసి భువనగిరి  పరిధిలో అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఈ దఫా తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఎక్కడా క్షేత్రస్థాయిలో సమన్వయలోపం లేకుండా చేయడంతో పాటూ ఇతర పార్టీల నుంచి ముఖ్య నేతల చేరికలను రాజగోపాల్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


జోష్‌ను అందిపుచ్చుకోవాలని భారాస

నల్గొండ, భువనగిరి స్థానాల్లో ఇటీవల భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ బస్సుయాత్ర సందర్భంగా పార్టీ, కార్యకర్తల్లో నెలకొన్న జోష్‌ను అందిపుచ్చుకోవాలని భారాస యోచిస్తోంది. నేటి నుంచి రెండు లోక్‌సభ స్థానాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకులు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు మద్దతు ఇవ్వడం ఎంత అవసరమో గడప గడపకూ వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు పార్టీ నల్గొండ, భువనగిరి అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేష్‌ నియోజకవర్గాలు, మండలాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలనే నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ గడువు దగ్గర పడుతున్నందున ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించారు. పార్టీలో, క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రచార, సమన్వయ లోపం లేకుండా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన సూర్యాపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు పార్టీ అగ్రనేతల రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించడం, అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భారాసకు అండగా ఎందుకు ఉండాలన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నేడు మాజీ మంత్రి హరీశ్‌రావు భువనగిరి, నల్గొండ లోక్‌సభ పరిధిలోని మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు.


బూత్‌ స్థాయి కమిటీలే ప్రాధాన్యంగా భాజపా

పార్టీకి తొలి నుంచి ప్రాధాన్యంగా ఉన్న బూత్‌ కమిటీల ద్వారా రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని భాజపా నిర్ణయించింది. ఇప్పటికే రెండు స్థానాల్లోనూ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు అభ్యర్థులు శానంపూడి సైదిరెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌ క్షేత్రస్థాయిలో నెలకొన్న సానుకూల పరిస్థితిని గెలుపు వరకు తీసుకెళ్లేలా వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే ప్రచారాన్ని ప్రారంభించడంతో అన్ని సెగ్మెంట్లలో ఇప్పటికే ఒక దశ ప్రచారాన్ని ముగించగా...రాబోయే రోజుల్లో బూత్‌ స్థాయిలో ముఖ్య నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో పాటూ పార్టీ అంతర్గత సర్వేల్లో వెల్లడించిన విధంగా ఎక్కడ బలహీనంగా ఉన్నామో అక్కడ మరో విడత ప్రచారాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ఈ నెల 6న భువనగిరి, నల్గొండల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు. రెండు స్థానాల్లోనూ ఓటర్లు, పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. నల్గొండ, భువనగిరి, చౌటుప్పల్‌, జనగామ, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ, కోదాడ లాంటి అర్బన్‌ ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి సారించాలని నిర్ణయించి పలువురు కీలక నేతలకు ఈ ప్రాంతాల్లో పార్టీ నేతల సమన్వయానికి బాధ్యతలు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని