logo

సేవ చేద్దాం.. ఆనందాలు పంచుదాం!

కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్‌ క్రాస్‌’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్‌ క్రాస్‌ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది.

Updated : 08 May 2024 06:21 IST

నేడు ‘ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం’

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: కరోనాకు ముందు రక్తదాన శిబిరం అంటే ‘రెడ్‌ క్రాస్‌’ సంస్థ ఆధ్వర్యంలోనే ఏర్పాటయ్యేవి. రక్తదాన శిబిరాల నుంచి వైద్య శిబిరాల వరకు పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ.. ఎందరో ప్రజల మనసుల్లో నాటుకుపోయిన రెడ్‌ క్రాస్‌ సంస్థను విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఉమ్మడి జిల్లాలో 60 ఏళ్ల క్రితమే రెడ్‌ క్రాస్‌ సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్‌ హెన్రీడ్యూనాంట్‌ జయంతిని పురస్కరించుకుని ఏటా మే 8న ‘ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

జనరిక్‌ మందులు.. రక్త నిల్వ కేంద్రం

ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, మోత్కూరులో సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా నల్గొండ జిల్లా కేంద్రంలో జనరిక్‌ మందుల దుకాణం ఏర్పాటు చేశారు. దీని వల్ల పేదలు తక్కువ ధరకే మందులు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి నెలా సుమారు 200 యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరిస్తూ.. అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేసి నామమాత్రపు రుసుముకే మృతదేహాలను స్మశానవాటికకు తరలిస్తున్నారు. ఫ్రీజర్‌ బాక్సును సైతం ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. సీపీఆర్‌ తదితర ప్రాథమిక చికిత్సలపై కళాశాలల్లో ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ పలువురి జీవితాల్లో వెలుగులు సైతం నింపుతున్నారు. ప్రతి నెలా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ 60 ఏళ్లు పైబడిన వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు. మిర్యాలగూడ రెడ్‌ క్రాస్‌ సంస్థ సేవా కార్యక్రమాలకు గాను అనేక అవార్డులు సైతం సొంతం చేసుకుంది.


త్వరలోనే సేవల విస్తరణ..

- గోలి అమరేందర్‌రెడ్డి, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌, నల్గొండ

కరోనా నుంచి రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు తగ్గిపోయాయి. త్వరలోనే సేవలను విస్తరించేందుకు మండల స్థాయిలో సైతం సంస్థ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ సారథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలోనే వృద్ధాశ్రమం సైతం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సేవా గుణం కలిగిన వారు ఎవరైనా రూ.1,050 చెల్లించి ఆన్‌లైన్‌లో సభ్యులుగా చేరవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు